బిడ్డకు సీఎం కేసీఆర్ నామకరణం..నెరవేరిన 9 ఏళ్ల కల

బిడ్డకు సీఎం కేసీఆర్ నామకరణం..నెరవేరిన 9 ఏళ్ల కల

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తమ బిడ్డకు నామకరణం చేయించుకోవాలని ఆ దంపతులు అనుకున్నారు. ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇలా 9 ఏండ్లు గడిచిపోయాయి. చివరకు వారి కల నెరవేరింది. స్వయంగా సీఎం కేసీఆర్ నామకరణం చేయడమే కాకుండా సాంప్రదాయ పద్ధతిలో ఇచ్చిన అతిథ్యం చూసి వారు ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి దంపతులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. 

భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన సురేశ్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. సురేశ్, అనిత దంపతులకు 2013లో ఆడ పిల్ల జన్మించింది. తమ బిడ్డకు ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ తో నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. బిడ్డకు 9 ఏండ్లు వచ్చాయి. ఈ విషయం మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూధనా చారికి తెలిసింది. వారిని పిలిపించుకుని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ను కలిసే విధంగా చేస్తానని హామీనిచ్చారు. చెప్పినట్లుగానే ప్రగతి భవన్ కు వారిని తీసుకెళ్లారు. 

సీఎం కేసీఆర్ దంపతులు వారిని ఇంట్లోకి స్వాగతించారు. సురేష్, అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు ‘మహతి’ అని నామకరణం చేశారు. ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్దతిలో ఆతిథ్యమిచ్చారు. బిడ్డ చదువు కోసం ఆర్థిక సాయాన్ని అందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, ఊహించని రీతిలో ఆదరించి దీవించిన తీరుకు సురేష్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ఈ సందర్భంగా వారు సీఎం దంపతులకు కృతజ్జతలు తెలిపారు.