
రంగారెడ్డి: రామానుజాచార్యుల విగ్రహం సమానత్వానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, మనమంతా రామానుజ స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల రెండో రోజు కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. యాగశాలను సందర్శించి పెరుమాళ్లను దర్శించుకున్నారు. అనంతరం సమతామూర్తి కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నజీయర్ స్వామితో కలిసి ముఖ్యమంత్రి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్ప్టాట్లను పరిశీలించారు. 216 అడుగుల సమతా మూర్తి విగ్రహం గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంను సీఎం పరిశీలించారు. ఫిబ్రవరి 5న సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.