ఐదు పథకాలు అమలు చేస్తే నేను మహారాష్ట్రకు రాను:సీఎం కేసీఆర్

ఐదు పథకాలు అమలు చేస్తే నేను మహారాష్ట్రకు రాను:సీఎం కేసీఆర్

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ప్రజల బతుకులు మారలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంతో మంది ప్రధానులు అయినా...కాంగ్రెస్, బీజేపీ ఎన్నో ఏండ్లు పరిపాలించినా..ఎందుకు ప్రజల జీవితాల్లో మార్పులు రాలేదని ప్రశ్నించారు. దేశాన్ని 54 ఏండ్లు కాంగ్రెస్, 16 ఏండ్లు బీజేపీ పాలించిందన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రజలకు తాగునీరు, సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, ఇతర దేశాల్లో లేని వ్యవసాయ యోగ్యమైన భూమి దేశంలో ఎక్కువగా ఉందన్నారు. సమృద్ధిగా వర్షాలు పడతాయని..ఇక్కడ వాతావరణం అద్భుతమైనదని చెప్పారు. దేశంలో మామిడి పండు పండుతుందని...ఆపిల్ కూడా పండుతున్నారు. దేశంలో అవసరానికి మించి నీటి వనరులున్నా..వాటిని ఉపయోగించుకోలేకపోతున్నామన్నారు.  దేశంలో ప్రతీ ఏడాది 50టీఎంసీల నీళ్లు  సముద్రంలో కలుస్తున్నాయని వెల్లడించారు. మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో తాగునీరు లభించడం లేదన్నారు. తనతో కలిసి నీళ్ల కోసం యుద్ధం చేయాలని..సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో ఎంత కావాలంటే అంత కరెంట్ ఇచ్చేందుకు బొగ్గు అపారంగా ఉందన్నారు. 361 బిలియన్ టన్నుల బొగ్గు మన దగ్గర ఉందని...ఇది దేశం మొత్తానికి 150 ఏళ్లకు సరిపోతుందన్నారు. అయినా కేంద్రం అవసరమైన  కరెంట్ సరఫరా చేయలేకపోతుందన్నారు. 

ఐదు పనులు చేస్తే మహారాష్ట్రకు రాను..

మహారాష్ట్రలో మీకేం పని అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనను  అడుగుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.  భారత పౌరుడిగా ఏ రాష్ట్రానికైనా వెళ్తానని చెప్పారు. మహారాష్ట్రలో రైతులకు ఎకరాకు పది వేల రూపాయలు  పెట్టుబడి సాయం అందించాలి. ఉచితంగా 24 గంటల కరెంట్ ఇవ్వాలి. సాగునీరు ఉచితంగా అందించాలి. మహారాష్ట్రలో రైతు చనిపోతే రూ. 5లక్షల రూపాయలు బీమా అందించాలి. అంతేకాకుండా రైతులు పండించే ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఇవన్నీ  మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తే తాను మహారాష్ట్రకు రాననన్నారు. ఈ పథకాలు అమలు చేసే వరకు మహారాష్ట్రకు వస్తూనే ఉంటానని..ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. తెలంగాణలో దళితబంధు కింద రూ. 10 లక్షలు ఇస్తున్నామన్నారు. మహారాష్ట్రలోనూ  దళితబంధును దేవేంద్ర ఫడ్నవీస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు మహారాష్ట్ర ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటానన్నారు. దేశమంతా తెలంగాణాలో అమలవుతున్న పథకాలు అమలవ్వాలన్నారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం..

గతంలో  నాందేడ్ లో బీఆర్ఎస్ సభ పెట్టిన తర్వాత మహారాష్ట్ర సర్కారు  రైతులకు ఎకరాలకు 6వేల రూపాయలు ఇవ్వడం ప్రారంభించిందని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ సభకు ముందు ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  గులాబీ జెండాలో ఎంత సత్తా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. రూ. 6వేలు అవసరం లేదని..ఎకరాకు రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో 75 ఏండ్లుగా రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారని..అయినా వారి సమస్యలు తీరడం లేదన్నారు. జీవితాంతం పోరాటాలు చేస్తూనే ఉండాలా అని ప్రశ్నించారు. ఒక్కసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. మహారాష్ట్రలో త్వరలో జరిగే పంచాయితీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు. 

రోజూ ఏడ్చేవాడిని..

తెలంగాణ రాకముందు అక్కడ ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రతీ రోజూ  వాళ్లకు దండం పెట్టి..ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పానన్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టాలని కోరినట్లు వెల్లడించారు. తెలంగాణ వచ్చాక కరెంట్, సాగునీరు, పెట్టుబడి సాయం అందించామన్నారు. ఇప్పుడు తెలంగాణలో  రైతులు సంతోషంగాఉన్నారని తెలిపారు. తెలంగాణ కంటే మహారాష్ట్రలో సంపద ఎక్కువ ఉందన్నారు. తెలంగాణ కంటే మహారాష్ట్ర మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలోనూ ఇక్కడి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.