నిర్మల్ జిల్లాను తెచ్చిందే ఇంద్రకరణ్ రెడ్డి : కేసీఆర్

నిర్మల్ జిల్లాను తెచ్చిందే ఇంద్రకరణ్ రెడ్డి : కేసీఆర్
  •     మంచి మనిషిని గెలిపించుకోండి
  •     70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తా 
  •     అభివృద్ధిలో నిర్మల్ ఆదర్శం
  •     నిర్మల్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాను ఇచ్చింది తానైతే తెచ్చింది మాత్రం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అని సీఎం కేసీఆర్ అన్నారు. నిర్మల్​లో గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఇంద్రకరణ్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. పుట్టిన ప్రాంతంపై ఆయనకు ఎంతో ప్రేమ ఉందని, నిర్మల్ అభివృద్ధి కోసం అనునిత్యం తపించే నేత అని కితాబిచ్చారు. ఆయన సూచన మేరకే నిర్మల్ జిల్లాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నిర్మల్​ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని, బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతోనే ఆయన గెలుపు ఖాయమైందన్నారు.  ఇంద్రకరణ్ రెడ్డిని 60 నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీని కూడా మంజూరు చేస్తానన్నారు. మంత్రి కోరిన విధంగా అండర్​గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు స్వర్ణ ప్రాజెక్టు లైనింగ్, ఎత్తిపోతల పథకాల కోసం నిధులు మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.

నిర్మల్ పై సీఎంకు ప్రత్యేక ప్రేమ: ఇంద్రకరణ్ రెడ్డి 

ముఖ్యమంత్రి కేసీఆర్​కు నిర్మల్ జిల్లాపై ప్రత్యేక అభిమానం, ప్రేమ ఉందని నిర్మల్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నిర్మల్ అభివృద్ధి కోసం ఏమి అడిగినా ఇప్పటివరకు సీఎం కాదనలేదన్నారు. మార్కెట్ నిర్మాణం కోసం రూ.10 కోట్లు, మసీదు నిర్మాణం కోసం రూ.3.5 కోట్లు, మ్యారేజ్ హాల్ నిర్మాణం కోసం ఎస్​డీఎఫ్ కింద రూ.5 కోట్ల మంజూరు చేశారని గుర్తుచేశారు.

నిర్మల్​లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం కూడా నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. స్వర్ణ ప్రాజెక్టు కాలువల లైనింగ్ కోసం రూ.25 కోట్లు, ఎస్సారెస్పీ ముంపు గ్రామాల పరిధిలోని దిలావర్​పూర్, బన్సపల్లి, కంజర, లోలంలో ఎత్తిపోతల పథకాల కోసం రూ.90 కోట్లు మంజూరు చేయాలని సీఎంను మంత్రి కోరారు. నిర్మల్ లో జేఎన్టీయూ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీని, ఐటీ కారిడార్ ను కూడా ఏర్పాటు చేయాలని కోరారు.

ALSO READ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు.. రేపు(నవంబర్ 03) నోటిఫికేషన్‌ జారీ

బీఆర్ఎస్ లో జోష్

సీఎం బహిరంగ సభకు జనం భారీ సంఖ్యలో హాజరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రెండు రోజులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జన సమీకరణ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలి వచ్చి సీఎం ప్రసంగం మధ్య జేజేలు కొట్టడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్​కనిపిస్తోంది. సభ సక్సెస్ కావడంతో సీనియర్ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.