కేంద్రం తీరును పార్లమెంట్​లో ఎండగట్టాలె

కేంద్రం తీరును పార్లమెంట్​లో ఎండగట్టాలె
  • వడ్ల కొనుగోళ్లపై కేంద్రం తీరును పార్లమెంట్​లో ఎండగట్టాలె
  • టీఆర్​ఎస్​ ఎంపీలకు సీఎం కేసీఆర్​ ఆదేశం
  • అంశాల వారీగా మిగతా పార్టీలకు మద్దతివ్వండి
  • పీయూష్​ గోయల్​ సమాధానంపై నేనే ప్రెస్​మీట్​ పెడ్త
  • ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఏం తక్కువ చేసినం
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీనే ధిక్కరిస్తున్నరని ఫైర్​
  • ఎమ్మెల్సీ ఎన్నికలైనంక జంతర్‌‌ మంతర్‌‌ దగ్గర ధర్నా చేద్దాం


స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర కేబినెట్‌‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం ఢిల్లీలోని జంతర్‌‌ మంతర్‌‌ దగ్గర ధర్నా చేద్దామని సీఎం కేసీఆర్​ చెప్పినట్టు తెలిసింది. అప్పటి వరకు పార్లమెంట్‌‌ వేదికగా పోరు కొనసాగించాలని ఎంపీలకు సూచించారు. పార్లమెంట్‌‌లో చేస్తున్న పోరాటానికి తోడుగా జంతర్‌‌ మంతర్‌‌ దగ్గర ధర్నా చేస్తే ధాన్యం సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న పక్షపాత వైఖరిని ఎండగట్టినట్టు అవుతుందని చెప్పినట్టు తెలిసింది. ధాన్యం సేకరణపై జంతర్‌‌ మంతర్‌‌ వద్ద  కాంగ్రెస్‌‌ చేపట్టే  ఆందోళనకు మద్దతుగా వెళ్లే విషయం మీద కూడా సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఈ ఆందోళనలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా కాంగ్రెస్‌‌ విమర్శలు చేసే అవకాశముంది కాబట్టి వెళ్లకపోవడమే మంచిదనే భావనకు వచ్చినట్టు తెలిసింది. ఆ ఆందోళనకు ఇంకా సమయం ఉంది కాబట్టి అప్పటి పరిస్థితులపై నిర్ణయం తీసుకుందామని ఎంపీలతో కేసీఆర్‌‌ చెప్పినట్టు సమాచారం.

హైదరాబాద్‌‌, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై ఇంకింత గట్టిగా పార్లమెంట్​లో కొట్లాడాలని, కేంద్రం తీరును ఎండగట్టాలని సీఎం కేసీఆర్‌‌ టీఆర్​ఎస్​ ఎంపీలను ఆదేశించారు. గడిచిన ఐదురోజులుగా పార్లమెంట్​ సమావేశాల్లో ఎంపీలు తెగువ చూపారని ఆయన మెచ్చుకున్నారు. ఈ వారంలోనూ సభలో దూకుడుగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్ర రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా పోరాటం చేయాలని చెప్పారు. శనివారం ప్రగతి భవన్‌‌లో టీఆర్​ఎస్​ ఎంపీలతో కేసీఆర్​ సమావేశమయ్యారు. ‘‘ధాన్యం కొనుగోళ్ల బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూస్తున్నది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం అమలు చేస్తున్నది. ఈ అంశాన్ని పార్లమెంట్​ వేదికగా మరింత గట్టిగా చెప్పాలె. బీజేపీ  విధానాలను కార్నర్​ చేయాలె” అని ఎంపీలకు ఆయన సూచించినట్లు తెలిసింది. 

క్యాంపుల్లోని ఓట్లన్నీ మనకే పడాలి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపుల్లో ఉన్న అన్ని ఓట్లు టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థులకే పడేలా జాగ్రత్త పడాలని కేసీఆర్‌‌ సూచించారు. ఇప్పటి వరకు పార్లమెంట్‌‌లో ఉన్న ఎంపీలు ఆయా జిల్లాల క్యాంపులకు వెళ్లాలని ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్‌‌, మెదక్‌‌, ఆదిలాబాద్‌‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన లోక్‌‌సభ, రాజ్యసభ సభ్యులు పోలింగ్‌‌ ముగిసే వరకు పార్లమెంట్‌‌కు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. కరీంనగర్‌‌లోని రెండు సీట్లతో పాటు మెదక్‌‌, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్‌‌లోని ఒక్కో సీటు టీఆర్‌‌ఎస్‌‌ గెలిచి తీరాల్సిందేనన్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఏం తక్కువ చేశామని.. వాళ్లు ప్రభుత్వంపై, సొంత పార్టీపై ఎందుకు కోపం పెంచుకున్నారని కేసీఆర్​ ప్రశ్నించారు. వేరే ఏ రాష్ట్రంలో లేనంతగా గౌరవ వేతనాలు ఇస్తున్నామన్నారు. క్యాంపులో ఉన్నా కొందరు.. ఇతర అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోందని, వాళ్లను గుర్తించి అసంతృప్తిని చల్లార్చాలన్నారు. ముఖ్యంగా కరీంనగర్‌‌ సీటుపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఆదిలాబాద్‌‌, ఖమ్మం సీట్లలోనూ కొంత డిస్ట్రబెన్స్‌‌ ఉందన్నారు.

వరి సాగు విషయంలో తన సూచనను బీజేపీ రాష్ట్ర నేతలు పక్కదారి పట్టిస్తున్నారని, ఈ విషయాన్ని కూడా పార్లమెంట్‌ వేదికగా చాటి చెప్పగలిగామని, రానున్న రోజుల్లోనూ దీనిపై నిలబడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్​ సూచించారు. 
వరి వేయొద్దంటే కొంత వ్యతిరేకత వస్తున్నది
రాష్ట్రంలో కాళేశ్వరం సహా పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నాయని, యాసంగిలో వరి వేయొద్దని  అంటే రైతుల్లో కొంత వ్యతిరేకత ఎదురవుతోందని సీఎం అన్నారు. దీని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై పడకుండా ఉండేందుకు కొన్ని నెలలుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంతోనే వరి వద్దంటున్నామనే విషయం చెప్పగలిగామని ఆయన ఎంపీలతో అన్నట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర నేతలతో పాటు ఆ పార్టీ సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని,  దీనిని తిప్పికొట్టడానికి పార్లమెంట్‌నే వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు.  అంశాల వారీగా మిగతా పార్టీలు చేసే ఆందోళనలకు మద్దతు పలకాలని వారికి చెప్పారు. 
గోయల్‌ సమాధానంపై నేనే ప్రజలకు వివరిస్త
రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణపై శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి పీయూష్‌  గోయల్‌ ఇచ్చిన సమాధానంపైనా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. కేంద్ర మంత్రి చెప్పిన తీరును, రాజకీయంగా చేసిన వ్యాఖ్యలను కేసీఆర్‌ తప్పుబట్టినట్టు  సమాచారం. వీటిపై ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళనలు కొనసాగించాలని ఆయన సూచించినట్టు తెలిసింది. కేంద్ర మంత్రి సభలో చెప్పిన సమాధానంపై  తానే స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రజలకు వివరిస్తానని కేసీఆర్​ చెప్పినట్టు సమాచారం. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిందేనని, పార్టీ ప్రజాప్రతినిధులంతా ఈ అంశంపై ఫోకస్‌ చేయాల్సి ఉందని చెప్పారు.  అయితే తాను ముందు లెక్కలతోపాటు కేంద్రం తీరును ఎండగడతామని, ఆ తర్వాతే మిగతా వాళ్లు దీనిపై స్పందించాలని సీఎం కేసీఆర్​ సూచించినట్టు తెలిసింది.