కమీషన్ల దందా ఆగలే! .. దళిత బంధుకు రూ. లక్ష..  బీసీ బంధుకు రూ.20 వేలు వసూల్

కమీషన్ల దందా ఆగలే! ..  దళిత బంధుకు రూ. లక్ష..  బీసీ బంధుకు రూ.20 వేలు వసూల్
  • గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ లీడర్ల చేతివాటం
  • డబ్బులు ఇవ్వకుంటే లిస్టులో పేరు ఉండదని హెచ్చరికలు

గద్వాల, వెలుగు: లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లు ఆపకుంటే సహించేది లేదని సీఎం కేసీఆర్​ హెచ్చరించినా ఆ పార్టీ లీడర్లలో మార్పు కనిపించడం లేదు. గద్వాల నియోజకవర్గంలో అధికార పార్టీ లీడర్లు దళిత బంధు, లక్ష రూపాయల ఆర్థికసాయం, గొర్రెల స్కీమ్స్​లో తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు, లీడర్ల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ లోకి వస్తే స్కీంలు ఇస్తామంటూ చేరికలను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గద్వాల మండలం అనంతపురం విలేజ్ కి చెందిన బీఆర్ఎస్  కార్యకర్తకు దళిత బంధు స్కీం కావాలంటే రూ. లక్ష ఇవ్వాలని గ్రామ లీడర్లు చెబుతున్న ఆడియో ఇప్పుడు నడిగడ్డలో వైరల్​గా మారింది. అలాగే బీసీబంధు యూనిట్​కు రూ. 20 వేల చొప్పున తీసుకొని, ఒక్కో ఇంటికి రెండు నుంచి మూడు యూనిట్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఆడియో లీక్  కలకలం..

బీఆర్ఎస్  లీడర్, దళిత బంధు వచ్చిన లబ్ధిదారుడు మాట్లాడిన ఆడియో బయటకు రావడంతో కమీషన్ల దందా బయటపడింది. గద్వాల మండలం అనంతపురం గ్రామానికి దళితబంధు స్కీం కింద ఆరు యూనిట్లు వచ్చాయి. వాటిలో మూడు యూనిట్లకు సంబంధించిన సాంక్షన్  లెటర్లు గద్వాల మండల లీడర్లకు తెలవకుండా బీఆర్ఎస్ కార్యకర్త తీసుకెళ్లాడు. దీంతో డబ్బులు ఇవ్వకుండా ఎలా తీసుకెళ్లావని కార్యకర్తను ఫోన్ లో బెదిరించారు. ఆయన మాటలను ఆ కార్యకర్త తన ఫోన్ లో రికార్డ్  చేసి బయట పెట్టడంతో లీడర్ల కమీషన్​ దందా వెలుగులోకి వచ్చింది. డబ్బులు ఇవ్వకపోతే దళిత బంధు ఎట్ల వస్తదో చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు.

లెటర్లు తీసుకెళ్లిన వారికి దళితబంధు రాదని, ఉత్త కాగితాలు తీసుకుంటే వచ్చినట్లు కాదని, ఎలా తెచ్చుకుంటారో చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అలాగే ధరూర్ మండలంలోని 3 గ్రామాల్లో కమీషన్ల పర్వం జోరుగా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.  దళిత బంధు లబ్ధిదారుల నుంచి రూ. లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు. కొందరు డబ్బులు ఇస్తుండగా, మరికొందరు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఎదురు తిరుగుతున్నారు. గద్వాల నియోజకవర్గానికి 1,100 దళితబంధు యూనిట్లు రాగా, ప్రతి యూనిట్ కు గ్రామ స్థాయిలో లీడర్లు తమ చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల ఒక యూనిట్ ను ఇద్దరికి పంచి రూ.50 వేల చొప్పున వసూలు చేశారని అంటున్నారు. ఇక గుడ్డందొడ్డి, కోతులగిద్ద, గోన్​పాడు గ్రామాల్లోని ఇతర పార్టీల లీడర్లకు దళితబంధు, బీసీ బంధు స్కీం ఎరవేసి పార్టీలో చేర్పించుకున్నారనే విమర్శలున్నారు. 

రెండు కులాల సర్టిఫికెట్లతో.. 

ఒకే కుటుంబంలో రెండు సర్టిఫికెట్లతో రెండు స్కీమ్​లు పొందిన వ్యవహారం గద్వాల మండలం పూడూరు గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఒక కుల సర్టిఫికెట్​తో గొర్రెల స్కీం, మరో కుల సర్టిఫికెట్ తో బీసీ బంధు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై కంప్లైంట్ కావడంతో కేసు నమోదైంది. రెండు కులాల సర్టిఫికెట్లతో లబ్ధి పొందిన వ్యక్తితో బీఆర్ఎస్ లీడర్లు కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. ఇలా కమీషన్లు తీసుకొని స్కీమ్​లు ఇస్తుండడంతో తమకు అన్యాయం జరుగుతోందని అర్హులు వాపోతున్నారు. ఆఫీసర్లు, లీడర్లు కమీషన్ల దందాకు బ్రేకులు వేయాలని కోరుతున్నారు.