శ్రీశైలం కరెంటుపై సర్కారు దిద్దుబాటు.. ‘వెలుగు’ కథనంతో కదలిక

శ్రీశైలం కరెంటుపై సర్కారు దిద్దుబాటు.. ‘వెలుగు’ కథనంతో కదలిక
  • ఆర్​ఎంసీ సిఫార్సులు ఎట్లా ఒప్పుకుంటారని ఫైర్​
  • ఆగమేఘాల మీద మీటింగ్​ పెట్టుకొని చర్చించిన అధికారులు
  • అనంతరం సిఫార్సులు ఒప్పుకోబోమంటూ కృష్ణా బోర్డుకు లేఖ
  • ఆర్​ఎంసీ మీటింగ్​కు గైర్హాజరు

హైదరాబాద్‌, వెలుగు : శ్రీశైలం కరెంట్​పై రాష్ట్ర సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. ‘శ్రీశైలం కరెంట్‌ను వదులుకున్నట్టేనా?’ అని సోమవారం ‘వెలుగు’ పేపర్​లో పబ్లిష్‌ అయిన స్టోరీకి స్పందించి.. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు సిఫార్సులపై శనివారం జరిగిన ఆర్​ఎంసీ సమావేశంలో ఓకే చెప్పిన తెలంగాణ సభ్యులు.. వాటిని ఒప్పుకోబోమంటూ సోమవారం ఆగమేఘాల మీద కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. అంతకుముందు సీఎం కేసీఆర్​..  జెన్​కో, ఇరిగేషన్​ అధికారులకు ఫోన్​లో క్లాస్​ తీసుకున్నారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న రికమండేషన్స్​కు ఎట్లా ఒప్పుకుంటారని వారిని ప్రశ్నించారు. తెలంగాణకు హక్కుగా ఉన్న కరెంట్‌‌ ఉత్పత్తిని నియంత్రించాలని చూస్తుంటే ఎట్లా ఊరుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరిగేషన్‌‌ అధికారులు స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌ ఆధ్వర్యంలో బీఆర్కే భవన్‌‌లో సమావేశమయ్యారు. జెన్‌‌కో డైరెక్టర్‌‌ సహా ఆ శాఖ అధికారులను పిలిచి మాట్లాడారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు.  

మీటింగ్​కు పోలే

సోమవారం జరిగిన కేఆర్‌‌ఎంబీ ఆర్‌‌ఎంసీ మీటింగ్‌‌కు తెలంగాణ సభ్యులు హాజరు కాలేదు. శనివారం నాటి సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషన్‌‌ ప్రొటోకాల్‌‌ (రూల్‌‌ కర్వ్స్‌‌), పవర్‌‌ జనరేషన్‌‌, ప్రాజెక్టులు సర్‌‌ప్లస్‌‌ అయ్యే రోజుల్లో నీటి వినియోగంపై కమిటీ ప్రతిపాదనలపై చర్చించారు. రెండు రాష్ట్రాల సభ్యులు శ్రీశైలం ప్రాజెక్టును ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు ఒప్పుకున్నారని సమావేశం తర్వాత కన్వీనర్‌‌ రవికుమార్‌‌ పిళ్లై మీడియాకు వెల్లడించారు. ఆ సమావేశం అదే రోజు ముగియలేదని.. సోమవారం మధ్యాహ్నం మళ్లీ కొనసాగుతుందని ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల టైంలో ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి సమావేశానికి వచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కన్వీనర్‌‌ రవికుమార్‌‌ పిళ్లై, కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ (పవర్‌‌) మౌన్‌‌తంగ్‌‌ మీటింగ్‌‌ హాల్​లోకి వచ్చారు. తెలంగాణ సభ్యుల రాకకోసం ఎదురుచూస్తున్నామని తెలంగాణ ఈఎన్సీ (జనరల్‌‌) మురళీధర్‌‌కు ఫోన్‌‌లో మెసేజ్‌‌ పెట్టారు. దానికి తెలంగాణ ఈఎన్సీ రిప్లయ్‌‌ ఇస్తూ.. తాము స్పెషల్‌‌ సీఎస్‌‌తో మీటింగ్‌‌లో ఉన్నామని, ఆర్‌‌ఎంసీ సమావేశానికి అటెండ్‌‌ కావడం లేదని.. తమ వ్యూస్‌‌తో కూడిన లేఖను కాసేపట్లో పంపిస్తామని పేర్కొన్నారు. 

ముందు ఒప్పుకొని.. ఇప్పుడు హ్యాండిస్తారా​

తెలంగాణ సభ్యుల తీరుపై ఆర్​ఎంసీ మీటింగ్​లో కన్వీనర్‌‌ పిళ్లై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసర్లకు కనీసం డిసిప్లేన్‌‌ లేకుంటే ఎలా..? ఆరు నెలల నుంచి ఈ వివాదాన్ని కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తే.. ముందు ఒప్పుకొని తీరా టైంకు హ్యాండ్‌‌ ఇస్తారా? అంటూ మండిపడ్డారు. శనివారం జరిగిన మీటింగ్‌‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు అంశాలపై తెలంగాణ సభ్యులు అంగీకారం తెలిపారని, ఈ వివరాలు తమ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సంతకాలు చేస్తామని చెప్పి మీటింగ్‌‌కు రాకుండా ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల క్రమశిక్షణా రాహిత్యాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్తానని సమావేశంలో ప్రకటించారు. ఆర్‌‌ఎంసీ ప్రతిపాదనలపై ఏపీ సభ్యులు సంతకాలు చేశారు. తెలంగాణ సభ్యుల సంతకాలు లేకుండానే వాటిని బోర్డుకు నివేదిస్తానని కన్వీనర్‌‌ పిళ్లై సమావేశంలో ప్రకటించారు.

ఆర్‌‌ఎంసీ సిఫార్సులను ఒప్పుకోబోమంటూ లేఖ

ఆర్‌‌ఎంసీ సిఫార్సులను తాము ఒప్పుకోబోమని తెలంగాణ ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌ తెలిపారు. సోమవారం సాయంత్రం కేఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌ ఎంపీ సింగ్‌‌కు లేఖ రాశారు. సిఫార్సులను తమ సభ్యులు ఒప్పుకోలేదని, అయినా కన్వీనర్‌‌గా ఉన్న పిళ్లై రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపినట్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. మీడియాతో పిళ్లై చెప్పిన విషయాలపై తమకు అభ్యంతరాలున్నాయన్నారు. ఆర్‌‌ఎంసీ సిఫార్సుల్లో ఏ ఒక్కదానికి కూడా తాము ఆమోదం తెలపలేదన్నారు. ఆర్‌‌ఎంసీ రిపోర్ట్‌‌లోని 4.2(ఐ)(ఏ) శ్రీశైలంలో కరెంట్‌‌ 50 : 50 నిష్పత్తిలో పంచుకోవాలనే ప్రతిపాదనే తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. శ్రీశైలం నిర్మించిందే హైడ్రో ఎలక్ట్రిక్‌‌ ప్రాజెక్టుగా అని, దీని నుంచి ఆవిరి నష్టాలతో కలుపుకొని 280 టీఎంసీలు కరెంట్‌‌ ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చని తెలిపారు. 2021 జూన్‌‌ 6న తమ రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం కెపాసిటీతో హైడల్‌‌ పవర్‌‌ జనరేట్‌‌ చేయాలని ఉత్తర్వులు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి నుంచి నీటిని లిఫ్ట్‌‌ చేయడానికి తమకు ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. శ్రీశైలంలో 830 కనిష్ట నీటిమట్టం నిర్వహించాలే తప్ప ఆర్‌‌ఎంసీ సిఫార్సుల్లో పేర్కొన్నట్టుగా 854 అడుగులు కాదని తెలిపారు. చెన్నై తాగునీటితో కలిపి పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నుంచి 34 టీఎంసీలకు మించి ఏపీ తరలించడానికే అవకాశం లేదని స్పెషల్​ సీఎస్​  లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టులన్నీ నిండిపోయే రోజుల్లో తీసుకున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దనే ప్రతిపాదన సహేతుకం కాదన్నారు. ఏపీ 60 టీఎంసీలు మళ్లించుకునేలా ప్రాజెక్టులు నిర్మించుకుందని తెలిపారు. ఏపీ వరద రోజుల్లో ఎంత మొత్తం నీటిని మళ్లించుకుందో అంతే నీటిని వరదల తర్వాత తెలంగాణ ఉపయోగించుకుని శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌లో స్టోర్‌‌ చేసుకునే అవకాశం ఇవ్వాలని తాము మొదటి నుంచి కోరుతున్నామన్నారు. తెలంగాణకు సాగు, తాగు, ఇండస్ట్రీస్‌‌ అవసరాల కోసం కృష్ణా నది నుంచి 575 టీఎంసీల నీళ్లు అవసరమని, అలాంటప్పుడు 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు సహేతుకం కాదని తెలిపారు. కొత్త ట్రిబ్యునల్‌‌ ఏర్పడి శాస్త్రీయంగా నీటి వాటాలు తేల్చేవరకు రెండు రాష్ట్రాలకు 50 :50 నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలన్నారు. ఒక వాటర్‌‌ ఇయర్‌‌లో ఉపయోగించుకోలేని నీటిని మరుసటి వాటర్‌‌ ఇయర్‌‌కు క్యారీ ఓవర్‌‌ చేయడానికి బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌ సిఫార్సులు ఉన్నాయని, ఈ అంశమే ఆర్‌‌ఎంసీ సిఫార్సుల్లో లేదని ఆక్షేపించారు. ఆర్‌‌ఎంసీ సిఫార్సులు తమకు ఆమోదయోగ్యం కాదు కాబట్టి వాటిని అబయెన్స్‌‌లో పెట్టాలని, మీడియా ఎదుట వెల్లడించిన అంశాలపై మెంబర్‌‌ కన్వీనర్‌‌ పిళ్లై వివరణ ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు.