పల్లాను గెలిపిస్తే చేర్యాలను నెలరోజుల్లో రెవెన్యూ డివిజన్‌ చేస్తాం: కేసీఆర్‌

పల్లాను గెలిపిస్తే చేర్యాలను నెలరోజుల్లో  రెవెన్యూ డివిజన్‌ చేస్తాం: కేసీఆర్‌

జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే  నెలరోజుల్లోనే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌ గా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.  జనగామలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జనగామలో మెడికల్‌ కళాశాలతో పాటు నర్సింగ్‌, పారామెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.  ఉమ్మడి రాష్ట్రంలో జనగామ పరిస్థితులు దారుణంగా ఉండేవని చెప్పిన కేసీఆర్.. ఒకప్పుడిది  కరువునేల అని, అప్పటి పరిస్థితులు చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తుచేసుకున్నారు.  

ఎన్నికలు రాగానే ప్రజలు  ఆగమాగం కావొద్దని,  మంచి, చెడు ఆలోచించి ఓటు వేయాలన్నారు కేసీఆర్ .  ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని అస్సులు  నమ్మొద్దని సూచించారు.  ఓటు అనేది మన భవిష్యత్ కాబట్టి ఆలోచించి వేయాలన్నారు.  తెలంగాణ అభివృద్ది ఒకరోజులో జరిగింది కాదన్నారు  కేసీఆర్.  దాని వెనుక చాలా శ్రమ ఉందన్నారు.  కాంగ్రెస్ ధరణిని తీసేస్తామని అంటుందని అలాంటి పార్టీని తీసి బంగాళాఖాతంలో పారేయాలని చెప్పారు.  ప్రాణం పోయినా సరే  ధరణిని తీసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.  

రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండాలని ధరణి తెచ్చామన్నారు కేసీఆర్ .  ధరణిలో రైతుల భూములను  టచ్ చేసే అధికారం ఎవరికి లేదన్నారు సీఎం. రైతుల కష్టాలు తనకు తెలుసు కాబట్టి రెవన్యూ అధికారుల అధికారాలు రైతు చేతిలో పెట్టామన్నారు.  రైతు వేలిముద్ర లేకుండా భూమి జోలికి ఎవరూ పోలేరని చెప్పారు.   రైతులు బాగుండాలంటే కాంగ్రెస్  పార్టీకి శిక్షించాలన్నారు.  కేసీఆర్ బతికున్నంత వరకు దళితబంధు కొనసాగుతుందని తెలిపారు.  బీసీ బంధు అందరికీ అందుతుందని వెల్లడించారు.  పల్లా రాజేశ్వర్ రెడ్డిని లక్ష మోజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.