మనకు మస్తు పతార: అందుకే అప్పులు పుడుతున్నయ్

మనకు మస్తు  పతార: అందుకే అప్పులు పుడుతున్నయ్

* ఎఫ్‌‌ఆర్‌‌బీఎం పరిమితికి లోబడే
* రుణాలు తీసుకుంటున్నం
* అప్పుల్లో దేశంలో మనం 25వ ప్లేస్​లో ఉన్నం
* తెలంగాణ బాండ్ల కోసం ఎదురు చూస్తున్నరు

ఆర్‌‌బీఐ ప్రతి మంగళవారం బాండ్లను వేలానికి పెడుతది. తెలంగాణ బాండ్లు వేలానికి ఎప్పుడు వస్తయా అని ఎదురు చూస్తున్నారు. సాధారణంగా పదేండ్లు, 15 ఏండ్లకే బాండ్లు ఉంటయి.. మనం 25 ఏండ్లు, 40 ఏండ్లు పెట్టినా బాండ్లు కొంటున్నరు. ఇది రాష్ట్రానికి ఉన్న మంచిపేరుతోనే సాధ్యమైతంది. అప్పులు తిరిగి చెల్లించడంలో ఎక్కడా డిఫాల్టర్‌‌ కాలే.. ఒక్కరోజు కూడా ఓడీ తీసుకోలే.
- అసెంబ్లీలో సీఎం కేసీఆర్​

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి పతార ఉంది కాబట్టే అప్పులు పుడుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఎఫ్‌‌ఆర్‌‌బీఎం పరిమితికి లోబడే రుణాలు తీసుకుంటున్నామని తెలిపారు. అప్పుల విషయంలో దేశంలో 25వ స్థానంలో రాష్ట్రం ఉందని చెప్పారు.  అప్పుల విషయంలో ప్రతిపక్షాలు మాట్లాడే మాటల్లోనే లోపం ఉందన్నారు. తెచ్చిన అప్పులను క్యాపిటల్‌‌ ఎక్స్‌‌పెండిచర్‌‌గానే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 2004 నుంచి 2014 దాకా తెలంగాణ ప్రాంతంలో క్యాపిటల్‌‌ ఎక్స్‌‌పెండిచర్‌‌గా రూ.54 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఆరేళ్లలో రూ.2.34 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా ఉత్తరప్రదేశ్‌‌ జీఎస్​డీపీలో 33 శాతం, మధ్యప్రదేశ్‌‌ జీఎస్​డీపీలో 34 శాతం అప్పులు చేస్తే.. తెలంగాణ కేవలం 24 శాతం అప్పులు మాత్రమే చేసిందని చెప్పారు. కరోనా కష్టకాలంలో రైతులు పండించిన వివిధ రకాల పంటలు కొన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. కరోనాతో రాష్ట్ర ఖజానాకు రూ.లక్ష కోట్ల నష్టం వచ్చిందని, అయినా ఒక్క రోజు కూడా సంక్షేమానికి నిధులు ఆపలేదన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు క్రమం తప్పకుండా ప్రతినెలా నిధులు ఇచ్చామని తెలిపారు.