కేసీఆర్​ స్కెచ్​కు కాంగ్రెస్ చిక్కొద్దు

కేసీఆర్​ స్కెచ్​కు కాంగ్రెస్ చిక్కొద్దు

2018లో చంద్రబాబును బూచీగా కేసీఆర్​ ప్రచారానికి వాడుకున్న విషయం తెలిసిందే. అలాగే మరోసారి అలాంటి వాతావరణం సృష్టించుకునే ప్రయత్నం లేదా కోవర్టు పాలిటిక్స్​ను కాంగ్రెస్​పై  కేసీఆర్​ ప్రయోగించే అవకాశంపై అనుమానాలు ఎలాగూ ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే,  తాజాగా  రైతే రాజు అనే పుస్తక విడుదల కార్యక్రమంలో ఓ సీమాంధ్రకు చెందిన నేత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. నన్ను తెలంగాణ వాడిగా గుర్తించండి, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఓటేస్తున్నాను అని  ఆయన  ఎన్నికల సమయంలోనే ఆ వ్యాఖ్యలు చేయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించకపోదు.  ఆయన ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? కేసీఆర్​ను ఎదుర్కోబోతున్న కాంగ్రెస్​కు అది ఏమేరకు ఉపయోగకరం? అది ఎన్నికల్లో  బీఆర్ ఎస్ ను గెలిపించాలన్న ధోరణిపై అనుమానాలు రావడం సహజం.

దీంతో తెలంగాణ సెంటిమెంట్ రెయిజయ్యేలా అది కేసీఆర్​కు ఉపయోగపడేలా చేస్తున్నారా?  ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే బీఆర్ ఎస్ పార్టీ దాన్ని ఎన్నికల్లో క్యాష్ చేసుకుని కాంగ్రెస్ కు కౌంటర్ గా వాడుకునే విధంగా లేదా? గతానుభవాలు అలాంటి అనుమానాలకు తావివ్వడం మరింత సహజం.  ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా ఆ ఆంధ్రా పెద్దమనిషి ఎక్కడా కనపడలేదు. తెలంగాణ వైపు ఎన్నడూ నిలబడలేదు. పైగా తెలంగాణను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో నిత్యం సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్నారు. ఆయనలాంటి వారే ఎంతో మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యారు.  ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన ఆయనలో  కేసీఆర్ కు  మేలు చేయాలన్న ఆలోచనపైనే అనుమానాలు రేకెత్తే అవకాశం ఉంది. కాంగ్రెస్​ పార్టీకి ఆ వ్యాఖ్యల వల్ల జరిగే ప్రయోజనం ఏమాత్రమైనా కనిపించేనా?

గతానుభవాల దృష్ట్యా అప్రమత్తత అవసరం

గతంలో 2014లో కూడా తెలంగాణ కాంగ్రెస్ లో కల్పించుకుని సరైన అభ్యర్థులకు సీట్లు ఇవ్వలేదన్న అపవాదు ఆయనపై ఉంది. 2018లో కూడా బాబుతో పొత్తు వల్ల కాంగ్రెస్ మరోసారి ఓటమి పాలవడం వెనక అలాంటి వారే ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో..  9 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయనే  పుస్తక విడుదల పేర  హైదరబాద్ లో ప్రోగ్రామ్ పెట్టుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేసి కేసీఆర్ కి ఆయుధాన్ని ఇవ్వాలనుకున్నారా?  అనే చర్చ విశ్లేషకుల్లోనూ జరుగుతోంది. పదేండ్ల తర్వాత తెలంగాణ ప్రజలు ఇపుడిపుడే కాంగ్రెస్​ పార్టీ వైపు చూస్తున్నారు.  2018లో లాగే, ఈసారి కూడా ఈన కాచి నక్కల పాలు చేయకుండా కాంగ్రెస్​ పార్టీ ప్రతి నిర్ణయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. 

కేసీఆర్​ బూచీలకు అవకాశం ఇవ్వొద్దు

తెలంగాణ అంతటా పోటీ చేస్తా అని  ప్రచారం చేసిన ఓ నాయకురాలు, తీరా ఎన్నికలు దగ్గరికొస్తున్న సమయంలో  కాంగ్రెస్​లో కలుస్తాం అంటున్నట్లు వార్తలు మరోవైపు వినిపిస్తున్నాయి. ఉన్న అనుమానాలకు ఇది మరో అదనపు అనుమానం.  ఆనాడు వైఎస్సార్ పోతిరెడ్డిపాడుతో కృష్ణా జలాలను, వనరులను ఆంధ్రాకు తరలిస్తుంటే  ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడింది ఒక్క పీజేఆర్ మాత్రమే. వైయస్సార్ కు​ఆనాడు ఉన్న ఆదరణ వేరు. ఇవాళ ఆయన పేరుతో ఇతరులను నమ్మితే, వారు కేసీఆర్​చేసే వ్యతిరేక ప్రచారానికి ఆయుధాలైతారేమోననే చర్చను కాంగ్రెస్​ పార్టీ పరిగణలోకి తీసుకోవాలి. లోతుగా చర్చించాలి.

ఆ తర్వాతే ఏదైనా తుది నిర్ణయం తీసుకోవాలి.  2018లో చంద్రబాబును బూచీగా వాడుకున్న కేసీఆర్, 2023లోనూ అలాగే కలిసిరావడానికి వేస్తున్న స్కెచ్​లపై కాంగ్రెస్​ నాయకత్వం దృష్టి పెట్టి పని చేస్తే మంచిది. కాకపోతే ఇది 2018 కాదు, కేసీఆర్​ చూపే బూచీలను నమ్మే పరిస్థితులు ఇపుడు అంతగా లేవు. కేసీఆర్​ మాటల పట్ల ప్రజల్లోనూ అప్రమత్తత పెరిగింది. అయినా కాంగ్రెస్​ పార్టీకి మాత్రం అప్రమత్తత అవసరమే.

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, 
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు