సీఎం కేసీఆర్​కు లిక్కర్​ కేసుపై ఉన్న శ్రద్ధ కృష్ణా నీళ్లపై లేదు

సీఎం కేసీఆర్​కు లిక్కర్​ కేసుపై ఉన్న శ్రద్ధ కృష్ణా నీళ్లపై లేదు
  • సిద్దిపేటకు రూ.714 కోట్లు ఇస్తే అలంపూర్ కు రూ.20 కోట్లేనా? 
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్​

అలంపూర్, వెలుగు : లిక్కర్​ కేసులో సిసోడియా అరెస్ట్​ను నిరసిస్తూ పీఎం మోడీకి లెటర్​ రాసిన సీఎం కేసీఆర్, కృష్ణాలో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా గురించి ఇప్పటివరకు కేంద్రానికి ఎందుకు లెటర్​ రాయలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ప్రవీణ్ కుమార్ నిలదీశారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆదివారం గద్వాల జిల్లా ఉండవెల్లి, అలంపూర్​లో పర్యటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ మీద ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రికి  కృష్ణ జలాల గురించి, ఖదీర్​ఖాన్​ మరణం గురించి లేదన్నారు. తొమ్మిదేండ్లలో తన సొంత నియోజకవర్గం గజ్వేల్ కు రూ.656 కోట్లు , సిద్దిపేటకు రూ.714 కోట్లు ఇచ్చిన కేసీఆర్, అలంపూర్ కు మాత్రం రూ.20 కోట్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్​ అని ప్రశ్నించారు.

నియోజకవర్గంలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేక పిల్లలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో నీరందక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం కూడా  కట్టివ్వలేదన్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టుకు రూ.700 కోట్లు కేటాయించి,  కేవలం రూ.300 కోట్లు ఖర్చు చేశారన్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి వంటి అన్ని రంగాల్లో గద్వాల జిల్లా వెనుకబాటుకు గురైందన్నారు. ఈ బాధలు పోవాలంటే వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించుకోవాలని ప్రవీణ్​కుమార్​ విజ్ఞప్తి చేశారు.