సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ లో ఆరుగురు అరెస్ట్ ..నిందితుల నుంచి రూ.9.30 లక్షలు స్వాధీనం

సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ లో ఆరుగురు అరెస్ట్ ..నిందితుల నుంచి రూ.9.30 లక్షలు స్వాధీనం
  • సూర్యాపేట ఎస్పీ నరసింహ వెల్లడి

కోదాడ, వెలుగు: సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ లో ఆరుగురు నిందితులను కోదాడ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మీడియా సమావేశంలో ఎస్పీ నరసింహ వివరాలు తెలిపారు. కోదాడ ఎమ్మెల్యేగా మల్లయ్య యాదవ్ ఉన్నప్పుడు సోషల్ మీడియా కో – ఆర్డినేటర్ గా చెడపంగు నరేశ్, ప్రైవేట్ పీఏలుగా ఉప్పల మధు, మర్ల వీరబాబు పనిచేశారు. మధు, వీరబాబుతో పాటు మునగాల మండలం నారాయణగూడెంకు చెందిన బీఆర్ఎస్ నేత సూరగాని రాంబాబు కలిసి క్యాంప్ ఆఫీసు వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ నిధులు కాజేసేందుకు యత్నించారు.  

వీరికి శాసనమండలి ఆఫీసులో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ గా చేసే సందీప్ తో పాత పరిచయాలు ఉన్నాయి. అతని ద్వారా చెక్కుల్లోని పేర్లు కలిగిన బయటి వ్యక్తులకు కమీషన్ ఇస్తామని ఆశ చూపించారు. అనంతరం  ఆ చెక్కులను డ్రా చేయించారు. ఇందుకు నరేశ్  ఫ్రెండ్ రంగిశెట్టి వెంకట్రావు సహకరించాడు. దీంతో 38 చెక్కుల ద్వారా రూ. 13.63 లక్షలను డ్రా చేసుకొని వాటాలుగా పంచుకున్నారు. ఇటీవల కొందరు లబ్ధిదారులు తమకు డబ్బులు రాలేదని ప్రస్తుత ఎమ్మెల్యే పద్మావతికి ఫిర్యాదు చేయడంతో స్కామ్ బయటపడింది. 

పోలీసులకు కంప్లయింట్ చేయడంతో ఎంక్వైరీ చేసి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద డ్రా చేయని 6 చెక్కులు, 9.30 లక్షల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  కేసు పర్యవేక్షణ చేసి నిందితులను అరెస్ట్ చేసిన కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, పట్టణ సీఐ శివశంకర్, సీసీ ఎస్సీఐ శివకుమార్, టౌన్ ఎస్ఐ హనుమానాయక్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.