
- సురవరం సుధాకర్‌రెడ్డికి అశ్రునివాళి
- నివాళులర్పించిన సీఎం రేవంత్, మంత్రులు, రాజకీయ ప్రముఖులు
- మగ్దూంభవన్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు రెడ్ ఆర్మీ ర్యాలీ
- ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
- గాంధీ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ అప్పగింత
- పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిన నేత అని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: కమ్యూనిస్టు దిగ్గజం, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమయాత్ర ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాల అనంతరం మగ్దూం భవన్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. గాంధీ మెడికల్ కళాశాల వరకు కొనసాగింది. మగ్దూం భవన్ వద్ద గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతిమయాత్ర పొడవునా ‘కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి అమర్ రహే’ అంటూ సీపీఐ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. సుధాకర్‌రెడ్డికి వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, మేధావులు, కళాకారులు, రచయితలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కార్మికులు, కర్షకులు కన్నీటి వీడ్కోలు పలికారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురవరం సుధాకర్‌రెడ్డి.. శుక్రవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
ప్రముఖుల నివాళి
సుధాకర్‌రెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం 9.35 గంటలకు హిమయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌కు తరలించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు సురవరం పార్థివ దేహంపై అరుణ పతాకాన్ని కప్పి రెడ్ సెల్యూట్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రముఖులు, పార్టీ శ్రేణులు, నేతలు, అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని అక్కడే ఉంచారు. సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సురవరం ప్రజా సేవను గుర్తు చేసుకున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, పీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, చిన్నారెడ్డి, మధుయాష్కిగౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, వామపక్ష నేతలు అజీజ్ పాషా, ఎంఏ బేబి, బీవీ రాఘవులు, ఎస్ వీరయ్య, జాన్ వెస్లీ, తమ్మినేని వీరభద్రం, విమలక్క, ప్రొఫెసర్ కోదండరామ్, ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, డాక్టర్ కె. కేశవరావు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణ, తదితరులు నివాళి అర్పించారు.
సుధాకర్‌రెడ్డిని శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేస్తం: సీఎం రేవంత్
జీవితాంతం సిద్ధాంతపరమైన విలువలతో కూడిన రాజకీయం చేసిన కమ్యూనిస్టు మహానేత సురవరం సుధాకర్‌రెడ్డిని శాశ్వతంగా గుర్తుంచుకునేలా తమ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ చెప్పారు. ఈ విషయంపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చిస్తామని ప్రకటించారు. ‘‘విలువలతో కూడిన, సిద్ధాంత, నిబద్ధత కలిగిన నాయకుల విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ సానుకూల ధృక్పథం, సానుభూతి ఉంది. అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ గౌరవార్థం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీకి వారి పేరును పెట్టుకున్నాం.
మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్‌రెడ్డి పేరు పెట్టాం. ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరును చిరస్థాయిగా గుర్తుంచుకునేలా గౌరవించుకున్నాం. అదేస్థాయిలో సురవరం సుధాకర్‌రెడ్డికి కూడా ప్రభుత్వం గౌరవం ఇస్తుంది” అని సీఎం చెప్పారు. సుధాకర్ రెడ్డి అధికారంలో ఉన్నా.. లేకపోయినా, ప్రజాప్రతినిధిగా ఉన్నా .. లేకపోయినా నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడూ వీడలేదని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు
నిరాడంబర జీవితం గడిపారు
విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు తన చివరిశ్వాస దాకా సిద్ధాంతాలు, విలువల విషయంలో సురవరం సుధాకర్‌రెడ్డి రాజీపడకుండా నిరాడంబరంగా జీవించారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ నుంచి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించినా.. ఏనాడూ అహంకారం, అహంభావం తన దరిదాపుల్లోకి రానీయలేదని అన్నారు. పాలమూరు బిడ్డగా బూర్గుల రామకృష్ణారావు, ఎస్.జైపాల్ రెడ్డి కోవలో కంచుపాడు కామ్రేడ్ సురవరం సుధాకర్ పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చారని అన్నారు.
సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టాలని సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో లేఖ పంపించారని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టామన్నారు. ఇదే సందర్భంగా సుధాకర్‌రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుతానని ఆరోజు చెప్పానని, కొంత ఆలస్యమైందని, ఈ రకంగా కలుసుకోవాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో వారి సేవలను స్మరించుకుని నివాళి అర్పించామని, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సంతాప సందేశాన్ని పంపించామన్నారు.
పేదల పక్షాన పోరాడారు: మంత్రి వివేక్
సువరం సుధాకర్‌రెడ్డి జాతీయస్థాయిలో గొప్ప కీర్తి గడించారని మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. సింగరేణి సంస్థల్లో యూనియన్లను బలపరచడానికి నిరంతరం పోరాటం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. పేదల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేసుకున్నారు. కాగా, నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాడిన గొప్పవ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నిరంతరం పేదల పక్షాన పోరాడుతూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారని గుర్తు చేశారు.
సురవరం సుధాకర్‌రెడ్డి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పీసీసీ ఛీప్ మహేశ్‌కుమార్ పేర్కొన్నారు. జీవితాంతం పోరాటాలతో గడిపిన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి అని మీనాక్షి నటరాజన్ అన్నారు. ప్రజా ప్రభుత్వాల ఏర్పాటులో సురవరం కృషి మరువలేనిదని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. నమ్మిన భావజాలానికి కట్టుబడిన మహనీయుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించి చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సురవరం సుధాకర్‌రెడ్డి మృతి దిగ్ర్భాంతికి గురి చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
‘రెడ్ ఆర్మీ’తో అంతిమ వీడ్కోలు
సురవరం సుధాకర్ రెడ్డికి ‘రెడ్ ఆర్మీ’తో సీపీఐ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. పోలీసులు, రెడ్ వలంటీర్ల కవాతు, ప్రజానాట్య మండలి కళాకారుల గీతాలపనలు, డప్పు దరువులతో అంతిమ యాత్ర కొనసాగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు రెడ్ డ్రెస్‌లు ధరించి, ఎర్ర జెండాలతో కవాతు చేస్తూ నీరాజనం పట్టారు. మగ్దూంభవన్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీకి చేరింది. సుధాకర్‌రెడ్డి కోరిక మేరకు ఆయన భౌతిక కాయాన్ని సతీమణి డాక్టర్ విజయలక్ష్మి, కుమారులు కపిల్, నిఖిల్ తోకలిసి సీపీఐ నేతలు గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఇందిరా, ఫిజియాలజీ హెచ్ ప్రొఫెసర్ రమాదేవి, అనాటమీ ప్రొఫెసర్ సుధాకర్‌కు అప్పగించారు.
యువతకు ఆదర్శం
సురవరం సుధాకర్‌రెడ్డిలాంటి ఒక గొప్ప నాయకుడిని తెలంగాణ కోల్పోయింది. చిన్ననాటి నుంచి ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం పోరాడారు. ఆయన రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం. సురవరం పేరు చిరస్థాయిగా నిలిచేలా కేబినెట్‌లో నిర్ణయం తీస్కుంటం.
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పేదల పక్షాన పోరాడారు: మంత్రి వివేక్
సువరం సుధాకర్‌రెడ్డి జాతీయస్థాయిలో గొప్ప కీర్తి గడించారని మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. సింగరేణి సంస్థల్లో యూనియన్లను బలపరచడానికి నిరంతరం పోరాటం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. పేదల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేసుకున్నారు. కాగా, నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాడిన గొప్పవ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
నిరంతరం పేదల పక్షాన పోరాడుతూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారని గుర్తు చేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పీసీసీ ఛీప్ మహేశ్‌కుమార్ పేర్కొన్నారు. జీవితాంతం పోరాటాలతో గడిపిన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి అని మీనాక్షి నటరాజన్ అన్నారు. ప్రజా ప్రభుత్వాల ఏర్పాటులో సురవరం కృషి మరువలేనిదని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. నమ్మిన భావజాలానికి కట్టుబడిన మహనీయుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించి చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సురవరం సుధాకర్‌రెడ్డి మృతి దిగ్ర్భాంతికి గురి చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.