పదేండ్లలో వందేండ్ల విధ్వంసం..కేసీఆర్​, ఆయన పరివారం అన్నిట్లో దోపిడీకి తెగబడ్డది

పదేండ్లలో వందేండ్ల విధ్వంసం..కేసీఆర్​, ఆయన పరివారం అన్నిట్లో దోపిడీకి తెగబడ్డది
  • ఒక్కొక్కటి అన్నిటినీ బయటకు తీస్తం: సీఎం రేవంత్​రెడ్డి
  • తండ్రీకొడుకు, మామా అల్లుడు రాష్ట్రాన్ని దివాలా తీయించిన్రు
  • ఏడాదికి రూ. 70వేల కోట్లు అప్పులకే కట్టాల్సిన పరిస్థితికి తెచ్చిన్రు
  • దూలం లెక్క పెరిగిన హరీశ్​కు దూడకు ఉన్న మెదడు కూడా లేదు
  • ప్రజా తీర్పు దెబ్బకు కేటీఆర్​ అమెరికా పారిపోయిండు.. 
  • ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతున్నడుకేసీఆర్​కు, కిషన్ రెడ్డికి తేడా లేదు.. 
  • బీఆర్ఎస్  స్క్రిప్ట్​నే కిషన్ రెడ్డి చదువుతున్నడు
  • మూడు పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా? అని సవాల్​
  • గ్రూప్​1 అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందజేస్తామని ప్రకటన​

హైదరాబాద్, వెలుగు: గత పదేండ్లలో కేసీఆర్‌‌, ఆయన పరివారం వందేండ్లలో చక్కదిద్దలేనంత విధ్వంసం చేసిందని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. అన్నిటిలో దోపిడీకి తెగబడిందని, ఒక్కొక్కటిగా అన్ని స్కామ్​లు బయటకు తీస్తామని హెచ్చరించారు. అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని, ఏటా రూ. 70వేల కోట్లు అప్పులకే కట్టాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారని అన్నారు. బీఆర్​ఎస్ ఎక్కడికక్కడ వదిలేసిన సంసారాన్ని, సృష్టించిన విధ్వంసాన్ని తాము చక్కదిద్దుతున్నామని ఆయన తెలిపారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. 


సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వర్​రావు, శ్రీధర్​బాబుతో కలిసి సీఎం రేవంత్​రెడ్డి సోమవారం సెక్రటేరియెట్​లో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్​ పాలనలోని అవినీతి, అక్రమాలను ఒకటొకటిగా అన్నింటినీ బయటకు తీస్తం. ఇప్పటికే గొర్రెల స్కీమ్​లోని అక్రమాలు, సీఎంఆర్​ఎఫ్​ అక్రమాలు బయటకు వచ్చినయ్​. గొర్రెల స్కీమ్​ అక్రమాలపై ఏసీబీ విచారణ మొదలుపెట్టడంతో ఒక్క బీఆర్​ఎస్​ నేత కూడా నోరుతెరుస్తలేడు. ఒకటొకటిగా అన్నిటినీ బయటకు తీస్తం. ఎవరినీ వదలం” అని స్పష్టం చేశారు. 

మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా?

ఎన్నికల మేనిఫెస్టోలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని బీఆర్​ఎస్​, బీజేపీ నేతలకు సీఎం రేవంత్​ రెడ్డి సవాల్​ చేశారు. 2014, 2018, 2023 ఎలక్షన్ మేనిఫెస్టోలపై ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చిద్దామని అన్నారు. ‘‘కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి మూడోసారి మోదీని ప్రధానమంత్రిని చేయాలని అంటున్నడు. చేస్తే ఏం చేస్తరు? రైతులను కాల్చి చంపుతరా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంస్థల్లో సింగరేణి సంస్థ కూడా ఉందని సీఎం తెలిపారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు తమ వంతు పాత్ర పోషించారని, అయితే గత పదేండ్లు సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహజ వనరులను ప్రైవేటుపరం చేస్తున్నదని, దాన్ని గతంలో బీఆర్​ఎస్​ సర్కార్​ అడ్డుకోకపోగా ప్రోత్సహించిందని మండిపడ్డారు. 

‘‘ఎన్నో ప్రభుత్వ సంస్థలతో పాటు బొగ్గు గనులకు కూడా కేంద్రం వేలం వేస్తున్నది. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం పదేండ్లపాటు నిధులను దుర్వినియోగం చేసింది. కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి రాష్ట్ర సమస్యలపై ఏమైనా కేంద్రంతో చర్చించారా.. ప్రస్తావించారా?” అని ఆయన ప్రశ్నించారు. రైతులు కనీస మద్దతు ధర అడిగితే కాల్చి చంపుతున్నది మోదీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. ఢిల్లీ సరిహద్దులో రైతులతో యుద్ధం చేస్తుంది ఎవరని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘కేసీఆర్, కిషన్ రెడ్డికి ఏమీ తేడా లేదు. ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేశారు.. నష్టం చేశారు. కిషన్ రెడ్డికి ప్రశ్నించే అర్హత లేదు.  బీఆర్ఎస్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చదువుతున్నడు” అని విమర్శించారు. 

నిరుద్యోగులను ముంచిండు

నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, వివాదాల పేరుతో వేలాది ఉద్యోగాల భర్తీని నిలిపివేస్తే తాము కోర్టు కేసులను పరిశీలించి నియామక పత్రాలు ఇస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. ‘‘పది సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము ఒక్కో శాఖలో ఉన్న ఖాళీలు, కోర్టు కేసులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నం. అరవై రోజుల్లో 25 వేల ఉద్యోగాలు ఇచ్చినం. 

మార్చి మొదటి వారంలో ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నం” అని స్పష్టం చేశారు. గ్రూప్​ 1కు ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో నాలెడ్జ్​ సెంటర్లు ఏర్పాటు చేసి, ఉచిత కోచింగ్​ అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రూ. 72 వేల కోట్ల అప్పులతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలై  పదేండ్లలో 7 లక్షల కోట్లకు చేరిందని, రాష్ట్ర ప్రభుత్వం 70 వేల కోట్లు అప్పు సంవత్సరానికి కట్టాల్సిన పరిస్థితిని గత బీఆర్​ఎస్​ సర్కార్​ కల్పించిందని మండిపడ్డారు. ‘‘దివాలా పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. 

రాష్ట్రం ఏర్పడిన సమయంలో సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉండేది. బీఆర్​ఎస్​ పాలన వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది. 25వ తేదీకి కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిని బీఆర్​ఎస్​ కల్పించింది. కానీ, మేము అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు టైమ్​కు జీతాలు ఇస్తున్నం. ఆర్థిక నియంత్రణను పాటిస్తూ.. అందరినీ సంతృప్తి పరిచేలా నిధుల ఖర్చులు చేపడ్తున్నం” అని తెలిపారు. తండ్రి కొడుకు, మామ అల్లుడి (కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు) మాటలను బీఆర్​ఎస్​ నేతలు కూడా ఆమోదించడం లేదని ఆయన అన్నారు. కౌన్సిల్​లో ఎమ్మెల్సీ కవిత, అసెంబ్లీలో హరీశ్​రావు, కేటీఆర్,  బహిరంగ సభల్లో కేసీఆర్​ మాట్లాడుతున్న మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 

హరీశ్​ మెదడు ఉండి మాట్లాడుతున్నడా?

హరీశ్​రావు మెదడు ఉండి మాట్లాడుతున్నారా? అని సీఎం రేవంత్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దూలం లెక్క పెరిగిన ఆయనకు దూడకు ఉన్న మెదడు కూడా లేదు. అన్నారం బ్యారేజీ పోయిందంటే.. మేడిగడ్డ నుంచి అన్నారంలో నీళ్లు ఎత్తిపోయాలంటున్నడు. మేడిగడ్డ కుంగి, అక్కడి నుంచి సముద్రంలోకి నీళ్లు వదిలినం. కాళేశ్వరంలో కాకి లెక్కలు రాసి లక్షల కోట్ల రూపాయలు తిన్నరు. నీళ్ల పేరుతో నిధుల దోపిడీ జరిగింది. తప్పుడు మాటలు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఊర్లు తిరుగుతున్నరు. వాళ్లు నిర్లక్ష్యంగా వదిలేస్తే మేము వచ్చి బాగు చేస్తున్నం” అని అన్నారు. మేడిగడ్డ, కృష్ణాజలాలపై ఇంకా బీఆర్​ఎస్ ​నేతలు అవే అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. 

వాన కూడా ఆయనే కురిపించిండా?

‘‘అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించినట్లు బీఆర్​ఎస్​ నేతలు చెప్పుకున్నరు. మిషన్​ భగీరథ, కాళేశ్వరం ఆస్తులా? ఏదైనా అప్పు తెచ్చినప్పుడు.. పెట్టిన పెట్టుబడితో వచ్చిన ఆదాయంతో అప్పు కట్టాలి. మిషన్​ భగీరథకు రూ.50 వేల కోట్ల అప్పు తెచ్చిన్రు. దాని నుంచి ఏమైనా ఆదాయం సృష్టించి.. ఆ ఆదాయంతో అప్పు కట్టిన్రా? కాళేశ్వరానికి లక్ష కోట్ల రూపాయలు తెచ్చి దాంతో ఏమైనా ఆదాయం పొంది.. అప్పులు కట్టిన్రా?” అని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వానికి వచ్చే నికర రాబడిని అప్పులకు కట్టారని, దీంతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని అన్నారు. 

ఎఫ్​ఆర్​బీఎంను బైపాస్​ చేసి కార్పొరేషన్లు సృష్టించి.. ఇష్టారీతిన అప్పులు చేశారని బీఆర్​ఎస్​పై మండిపడ్డారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నిండా ముంచారని అన్నారు. ‘‘కాళేశ్వరంతో అగ్రికల్చర్​ ఉత్పత్తి పెరగలేదు. చెరుకు, పత్తి, కందులు, సోయాబీన్​ పంటలన్నీ పోయినయ్​. బోరు పంప్​సెట్స్​ ఇంకింత పెరిగినయ్​. దాంతో వరి వేసుకునే పరిస్థితిని తెచ్చిన్రు. 

ఆ తర్వాత వరి వేస్తే ఉరేసుకోవాలని కేసీఆరే  చెప్పిండు. ఇట్లాంటి పరిస్థితిని తయారుచేసిండు” అని విమర్శించారు. కొన్నేండ్లుగా వర్షాలు బాగా పడటంతోనే భూగర్భజలాలు పెరిగాయని, దాన్ని బీఆర్​ఎస్​ ఖాతాల్లో వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘వాన కూడా ఆయనే కురిపించిండా?” అని వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు గ్రౌండ్​ వాటర్​ తగ్గిందట.. కేసీఆర్​నే ఏడన్న కూసుండ పెడ్దమా? ఆయనే గ్రౌండ్​ వాటర్​ పెంచుతడా’’ అని అన్నారు. రాష్ట్రంలో బోర్ల సంఖ్య పెరగడం వల్లే వరి ఉత్పత్తి పెరిగిందని.. కాళేశ్వరం వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. ఫైనాన్షియల్​ ఇయర్​ ముగిసే లోపు (మార్చి చివరి వరకు) రైతులకు రైతు బంధు అందజేస్తామని, ఇప్పటికే ఇస్తున్నామని తెలిపారు. 

కేటీఆర్​ను సీరియస్​గా తీసుకోం

‘‘సీఎంగా రేవంత్​రెడ్డిని ముందే ప్రకటిస్తే 30 సీట్లు కూడా కాంగ్రెస్​కు వచ్చేవి కాదని కేటీఆర్​ అంటున్నడు’’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్​ స్పందిస్తూ.. తాను కాంగ్రెస్​ పార్టీ ప్రెసెడింట్​గా ఉండి, అందరినీ కలుపుకొని, ఎన్నికల టైమ్​లో అన్నిచోట్ల మీటింగ్​ పెట్టానని తెలిపారు. పార్టీ ప్రెసిడెంట్​గా ఉండి తాను ఎలక్షన్​కు వెళ్లానని, బీఆర్​ఎస్​ నుంచి కేసీఆర్, బీజేపీ నుంచి కిషన్​ రెడ్డి ఎన్నికల్లో ప్రెసిడెంట్లుగా జనంలోకి వెళ్లారని అన్నారు. ‘‘కేసీఆర్​ స్లీపింగ్​ ప్రెసిడెంట్​ అని వర్కింగ్​ ప్రెసిడెంట్​గా కేటీఆర్​ను పెట్టిండు.. అయినా వాళ్ల పార్టీ రిజల్ట్​ ఏమైంది? దెబ్బకు కేటీఆర్​ అమెరికా పారిపోయిండని వార్తలు రాగానే మళ్లీ తిరిగొచ్చి.. అది కప్పిపుచ్చు కునేందుకు ఏదేదో మాట్లాడుతున్నడు. నేను కేటీఆర్​ను సీరియస్​గా తీసుకోవడం లేదు” అని వ్యాఖ్యానించారు.

సింగరేణి కార్మికులను కాపాడుకుంటం

సింగరేణి సంస్థపై అదనంగా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా కార్మికులకు బీమా పథకం అందుబాటులోకి తీసుకువచ్చామని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు.  ఇప్పటివరకు సైనికులకు మాత్రమే ఉన్న బీమా పథకాన్ని సింగరేణి కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్మికులకు కోటి రూపాయల బీమా పథకం గతంలో ఎప్పుడూ లేదని తెలిపారు. 43వేల మంది కార్మి కులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. కార్మికులను కాపాడుకుంటామని, వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా రూ.40 లక్షల బీమా వర్తిస్తుందని వెల్లడించారు. ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ సిబ్బందికి భారీ బీమా పథకం దేశంలో మరెక్కడా లేదని ఆయన అన్నారు.  

రేషన్​ కార్డులు ఇస్తం

అసలైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే రేషన్ కార్డును ప్రాథమిక అర్హతగా పెట్టామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘స్కీమ్​లకు అర్హుల గుర్తింపు నిరంతరం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసి మండల కార్యాలయాల్లో నిరంతరం కొత్త లబ్ధిదారులను చేరుస్తం. రేషన్ కార్డు నిబంధన లేకపోతే జూబ్లీహిల్స్​, బంజారా హిల్స్​లో ఉండే కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటరు. 

రాళ్లు, రప్పలు, హైవేలు, ఇండ్లకు కూడా గత బీఆర్​ఎస్​ సర్కార్​ రైతుబంధు ఇచ్చి.. రూ.22 వేల కోట్ల ప్రజాధనం వృథా చేసింది. అట్ల కావద్దనే రేషన్​ కార్డును ప్రాథమిక అర్హతగా  పెట్టినం. అర్హులకు తప్పకుండా రేషన్​ కార్డులు మంజూరు చేస్తం” అని సీఎం స్పష్టంచేశారు. గృహజ్యోతి (200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్​), రూ.500 సిలిండర్​ పథకాన్ని మంగళవారం ప్రారంభిస్తున్నామని, దీనికి రమ్మని అందర్నీ ఆహ్వానిస్తుంటే.. ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు.