
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం మెగా మాస్టర్ ప్లాన్ రూపొందించుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్రం మొత్తానికి ఒక మెగా పాలసీ అమలు చేస్తుంది తెలంగాణ. పాలసీ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మాస్టర్ ప్లాన్ చూస్తే ఎక్కడ ఏ రంగం రావాలి, ఎక్కడ గుణాత్మక అభివృద్ధి చేయాలో దానిలో వివరంగా పొందుపరుస్తారు.
ఇందులో భాగంగా తెలంగాణను మూడు వర్టికల్స్ కింద డివైడ్ చేస్తారు. అవుటర్ రింగ్ రోడ్ లోపల భాగం ‘కోర్ అర్బన్’ ప్రాంతం. అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ లోపల భాగం ‘సెమీ అర్బన్’ ప్రాంతం. రీజినల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ కారిడార్స్ వరకు ‘గ్రామీణ’ ప్రాంతం. కోర్ అర్బన్ ప్రాంతంలో సేవారంగం ఉంటుంది. సెమీ అర్బన్ ప్రాంతంలో పారిశ్రామిక రంగం ఉంటుంది.
రీజినల్ రింగ్ రోడ్ బయట వ్యవసాయ రంగం ఉంటుంది. తెలంగాణ మ్యాప్ తీసుకుని చూస్తే మీకు ఈ సర్కిళ్లు క్లియర్ గా కనిపిస్తాయి. ప్రభుత్వమే ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలి అనుకుంటోంది, ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా ఇన్వెస్టర్లు వారి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు అని మా ప్రభుత్వ ఆలోచన. ఇవన్నీ అమలు చేసే క్రమంలో ఎక్కడైనా డీవియేషన్లు, వయోలేషన్లు ఉన్నప్పుడు నియంత్రించడానికి కొన్ని కొత్త సంస్థలు ప్రభుత్వం తీసుకొస్తుంది, హైడ్రా కూడా ఇందులో భాగమే.
ప్రపంచ దేశాలలో అభివృద్ధి రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి పాలసీలు, రెండోది నిర్మాణం. ఏ అభివృద్ధి చెందిన దేశానికైనా ఈ రెండూ గ్రోత్ ఇంజిన్లుగా ఉంటాయి. ప్రభుత్వం పాలసీ రూపొందించాలి, విధానపరమైన నిర్ణయాలు చేయాలి. విధానపరమైన నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి. పారదర్శకతతో ఉన్న నిర్ణయాలు ప్రజలకి అందుబాటులో ఉండాలి.
ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు, పెట్టుబడులు ఆకర్షించినప్పుడు, అభివృద్ధి వాటి అంతటా అవే వేగంగా పెరుగుతాయి అనేది ప్రజా ప్రభుత్వం ఆలోచన విధానం. పారదర్శక విధానాన్ని తీసుకురావడానికి రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉంది.
పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, పెట్టుబడిని రక్షించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు తరాలకు సౌకర్యంగా ఉండేవిధంగా ప్రపంచస్థాయిలో కొత్త సిటీని నిర్మించాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ ‘ఫ్యూచర్ సిటీ’. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్.
ప్రపంచ దిగ్గజ నగరాలైన న్యూయార్క్, టోక్యో, సింగపూర్ లాంటి నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతుంది. మేం నిర్మించబోయే, తలచుకునే ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి ఆదర్శంగా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతం. రెన్యువల్ ఎనర్జీతో, అల్ట్రా మోడర్న్ సిటీని మా ప్రభుత్వం డిజైన్ చేస్తుంది. రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, డెడికేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే, డెడికేటెడ్ రైల్వే కారిడార్, మెట్రో విస్తరణ, భవిష్యత్తులో 100 సంవత్సరాలు ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన.
పెట్టుబడులకు ఆహ్వానం
సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెట్టుబడులకు ‘మీరు రండి.. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా నగరాన్ని అభివృద్ధి చేయండి’ అని విదేశాలకు వెళ్లి ఆహ్వానిస్తున్నరు. ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్ మొట్టమొదటి ప్రాధాన్యత స్థానిక ఇన్వెస్టర్లకు దక్కుతుందని, పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవుటర్ రింగ్ రోడ్ 160 కి.మీ నిర్మాణం చేస్తే, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం 3 లక్షల కోట్ల ఆదాయానికి పెరిగింది. అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆగిపోయిన రీజినల్ రింగ్ రోడ్, 360 కి.మీ రోడ్‌తోపాటు, రీజినల్ రింగ్ రైలు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించుకున్నాం. కొత్తగా మెట్రోను నగరంలో అన్ని ప్రాంతాలకు విస్తరించడానికి ప్రభుత్వం డిజైన్ చేస్తుంది.
హైటెక్ సిటీ నుంచి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఇలా ఎక్కడైతే చివరి రైల్ కనెక్టివిటీ తక్కువగా ఉందో వాటన్నింటికి ఇప్పుడు చివరి రైల్ కనెక్టివిటీ అందించడానికై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న విజయవాడ, బెంగళూరు హైవేలే కాకుండా సమాంతరంగా 11 రేడియల్ రోడ్లను ప్లాన్ చేస్తున్నారు. కొత్త ప్రాంత అభివృద్ధికి, కొత్త భూములను అందుబాటులోకి తెచ్చుకుని, శాటిలైట్ నగరాలను నిర్మించాల్సిన ప్రణాళికతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.
తాగునీటి కనెక్టివిటీ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందాలంటే, రోడ్డు కనెక్టివిటీ తోపాటు నీటి కనెక్టివిటీ మరియు విద్యుత్ కనెక్టివిటీ ఉండాలి. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో తాగునీరు చాలా ముఖ్యమైన విషయం. అందుకే రింగ్ బండ్ కూడా కడుతున్నారు.
గోదావరి నుంచి ఒకవేళ సమస్య వస్తే కృష్ణా నుంచి సప్లిమెంట్ చేయడానికి, కృష్ణా నుంచి సమస్య వస్తే గోదావరి నుంచి సప్లిమెంట్ చేయడానికి, అవుటర్ రింగ్ రోడ్ లాగ వాటర్ పైపులైను కూడా రింగ్‌గా కడుతున్నారు. ఎక్కడా నుంచి ఎక్కడికైనా తాగునీటి కనెక్టివిటీ ఉంటుంది. సింగూర్, మంజీరా, గోదావరి, కృష్ణా, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి తాగునీరు కనెక్టివిటీ నిర్మిస్తున్నారు.
400 కెవి నుంచి 800 కెవి అల్ట్రా మోడర్న్ ఉప కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలనుకున్న హైదరాబాద్ మహానగరం రోడ్ల మీదకు నీళ్లు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో మహానగరవాసులు ఆలోచించండి. నీళ్లు నిలవాల్సిన చెరువులను గత పదేండ్ల పాలకులు ఎలా కబ్జా చేశారో? నీరు ప్రవహించాల్సిన ప్రాంతాలను ఎలా ఆక్రమించారో? ఆలోచించండి.
హైడ్రా మహా యజ్ఞం
2000 పైగా ఉన్న చెరువులు ఇప్పుడు 450కి పడిపోయాయి. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఆ చెరువులను విరివిగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అందుకే హైడ్రా అనే ఒక మహా యజ్ఞాన్ని మొదలుపెట్టింది ప్రభుత్వం. రాబోయే ప్రకృతి వైపరీత్యాల నుంచి హైదరాబాదును రక్షించడమే హైడ్రా లక్ష్యం.
తెలంగాణను అభివృద్ధి హబ్ గా మార్చాలనేది ప్రజా ప్రభుత్వ ఆలోచన. మా ప్రభుత్వ లక్ష్యాలను అర్థం చేసుకోలేని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయ కుట్రలతో, అపోహలు సృష్టించి, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు.
రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడే చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోదు ఈ ప్రజా ప్రభుత్వం. ఏవైనా అపోహలు ఉంటే, ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు, సంప్రదించవచ్చు.. నివృత్తి చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యక్రమాలపై స్పందించి అందరం కలిసి తెలంగాణను గొప్పగా నిర్మించుకుందాం.
- డా. కొనగాల మహేష్, సీనియర్ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ -