- కెనడా హైకమిషనర్,
- ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందాలతో వేర్వేరుగా సీఎం భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యా సంస్థలు, అధునాతన సాంకేతిక కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని కెనడా హైకమిషనర్, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణలో పెట్టుబడులకు మంచి అవకాశం ఉందని తెలిపారు. కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్ లోని నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల గురించి వారికి సీఎం వివరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ రంగం, మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో కెనడా భాగస్వామ్యాన్ని విస్తరించే అంశాలపై చర్చించారు. సమావేశంలో క్రిస్టోఫర్ కూటర్ సతీమణి కరెన్, కెనడా మంత్రి ఎడ్ జాగర్, ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్ పాల్గొన్నారు.
పెట్టుబడులను విస్తరించండి
రాష్ట్రంలో పెట్టుబడులను విస్తరించాలని ఫ్రెంచ్ ప్రతినిధి బృందాన్ని రేవంత్ ఆహ్వానించారు. హైదరాబాద్ లోని ఫ్రెంచ్ బ్యూరో ఆఫీసును బలోపేతం చేయడం ద్వారా ఇరుపక్షాల మధ్య మరింత సన్నిహిత సహకారం కొనసాగించవచ్చని సూచించారు. ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. హైదరాబాద్‌లో ఫ్రెంచ్ సంస్థల సహకారంతో అమలవుతున్న ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ భేటీలో అలయన్స్ ఫ్రాన్స్ హైదరాబాద్ డైరెక్టర్ మౌద్ మిక్వా, ఫ్రెంచ్ బ్యూరో అసిస్టెంట్ రోహిణి రెడ్డిపల్లి పాల్గొన్నారు.
