ఆస్పత్రుల్లో ఏసీలు, కరెంట్‌‌ వైర్లు చెక్చేయండి.. అధికారులకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశాలు

ఆస్పత్రుల్లో ఏసీలు, కరెంట్‌‌ వైర్లు చెక్చేయండి.. అధికారులకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశాలు
  • ఫైర్ సేఫ్టీ, ముందస్తు భద్రతా చర్యలను పటిష్టం చేయాలి
  • బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ 
  • రిమ్స్​ను సందర్శించిన మంత్రి దామోదర్‌‌‌‌ రాజనర్సింహ

హైదరాబాద్/ఆదిలాబాద్‌‌, వెలుగు: ఆదిలాబాద్‌‌లోని రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పసికందులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన చిన్నారుల తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద తీవ్రతపై ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

ఈ దుర్ఘటనలో గాయపడిన, ఊపిరాడక అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.  వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. 

భవిష్యత్తులో రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా అన్ని హాస్పిటల్స్‌‌‌‌లో విద్యుత్‌‌‌‌ ఆడిట్‌‌‌‌ (ఏసీలు, కరెంట్​ సరఫరా చెకింగ్‌‌‌‌) నిర్వహించాలని, ఫైర్ సేఫ్టీ, ముందస్తు భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  

సమగ్ర విచారణ చేపడ్తం: రాజనర్సింహ

రిమ్స్ హాస్పిటల్‌‌‌‌లోని పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్​జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌‌‌‌‌‌‌‌ రాజనర్సింహ పరిశీలించారు. ప్రమాద సమయంలో చేపట్టిన సహాయక చర్యలు, చిన్నారుల ప్రస్తుత వైద్య పరిస్థితి, చికిత్స అందుతున్న విధానం, తీసుకున్న తక్షణ చర్యలపై  వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిమ్స్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ చాంబర్‌‌‌‌లో జిల్లా కలెక్టర్‌‌‌‌, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, రిమ్స్‌‌‌‌ వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రత, నిర్వహణలో లోపాలు తెలుసుకొని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

ఎలక్ట్రికల్‌‌‌‌, ఫైర్, సివిల్‌‌‌‌ స్ట్రక్చర్‌‌‌‌ సేఫ్టీ ఆడిట్స్‌‌‌‌ ఆధారంగా రిమ్స్‌‌‌‌లో అవసరమైన మరమ్మతులు, అదనపు మౌలిక వసతులు, పునరుద్ధరణ పనులు, కొత్త భవనాల నిర్మాణం, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలపై సమగ్ర అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని పేర్కొన్నారు. విచారణలో ఎవరి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం బయటపడినా, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రిమ్స్‌‌‌‌లో 150 పడకల ఎంసీహెచ్

రిమ్స్‌‌‌‌లో ఇప్పటికే సుమారు 800 పడకలు ఉన్నాయని, అదనంగా 150 బెడ్ల మదర్‌‌‌‌ అండ్‌‌‌‌ చైల్డ్‌‌‌‌ హెల్త్‌‌‌‌ (ఎంసీహెచ్) భవనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి దామోదర్‌‌‌‌‌‌‌‌ రాజనర్సింహ వెల్లడించారు. దీనివల్ల ప్రసూతి సేవలు, తల్లుల సంరక్షణ, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 

తలసేమియా, సికిల్‌‌‌‌సెల్‌‌‌‌ అనీమియా, హిమోఫీలియాలాంటి వ్యాధులకు మెరుగైన ట్రీట్‌‌‌‌మెంట్​కోసం హెమటాలజీ విభాగం.. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల కోసం ఎమర్జెన్సీ విభాగం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే, రిమ్స్‌‌‌‌లో పీజీ వైద్య విద్యార్థుల సంఖ్య, ఓపీ, ఐపీ సేవలను పెంచడంతోపాటు పీడియాట్రిక్స్‌‌‌‌, గైనకాలజీ, రేడియాలజీ తదితర విభాగాల్లో పీజీ సీట్ల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాయల్‌‌‌‌ శంకర్‌‌‌‌, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌‌‌‌ చోంగ్తూ, డీఎంఈ వాణి, జిల్లా కలెక్టర్‌‌‌‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌‌‌‌ మహాజన్‌‌‌‌, ఐటీడీఏ పీవో మంద మకరంద్‌‌‌‌, అదనపు కలెక్టర్‌‌‌‌ ఆర్‌‌‌‌.ఎస్‌‌‌‌. చిత్రు, మున్సిపల్‌‌‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ బండారి అనూష,  రిమ్స్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ జైసింగ్‌‌‌‌ రాథోడ్‌‌‌‌, డీఎంహెచ్‌‌‌‌వో సాధన పాల్గొన్నారు. కాగా, రిమ్స్‌‌‌‌ ఘటనపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ కవిత విచారం వ్యక్తం చేశారు.