రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన రిజల్ట్ కచ్చితంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన రిజల్ట్ కచ్చితంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలనతో దూకుడు చూపిస్తున్నారు. పలు శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇటీవల కాలంలో డ్రగ్స్ కల్చర్ బాగా పెరగిపోయింది. ఈ క్రమంలో డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తేదీ సోమవారం సచివాలయంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులతో రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడిపై  సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని సీఎం  రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

 యాంటీ నార్కోటిక్‌ బ్యూరో విభాగాన్ని బలోపేతం చేయాలని..  యాంటీ నార్కోటిక్‌ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్ట్‌ర్‌ను నియమించడంతోపాటు అవసరమైన నిధులు, వనరులు సమకూర్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన రిజల్ట్ కచ్చితంగా ఉండాలని అధికారులకు సీఎం చెప్పారు. డ్రగ్స్ రావాణా పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని.. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగించినా..  విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులతోపాటు ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.