మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ!

మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ!
  • పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • అధ్యయనానికి వెళ్లిన అగ్రికల్చర్, ఫైనాన్స్ ఆఫీసర్లు 
  • త్వరలో రాష్ట్ర సర్కారుకు ఆఫీసర్ల రిపోర్ట్​ 
  • పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్​లైన్స్ ఖరారు 
  • 2019లో రూ.2 లక్షల క్రాప్​లోన్లు మాఫీ చేసిన మహారాష్ట్ర 

హైదరాబాద్, వెలుగు : పంద్రాగస్టు కల్లా రైతుల క్రాప్​లోన్లు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పంట రుణాలు మాఫీ చేసిన విధానాలను అధ్యయనం చేస్తున్నారు. 2019లో మహారాష్ట్ర సర్కారు ఒకేసారి రూ.2 లక్షలలోపు రూ.20 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసింది. 

ఇదే మోడల్ మన రాష్ట్రంలోని పరిస్థితులకు కూడా అతికినట్టు సరిపోవడంతో ఆ పద్ధతిలోనే ఇక్కడా రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు.  సర్కారు ఆదేశాల మేరకు మహారాష్ట్ర మోడల్​ను అధ్యయనం చేసేందుకు అగ్రికల్చర్, ఫైనాన్స్ డిపార్ట్​మెంట్లకు చెందిన సీనియర్ ఆఫీసర్లు ఇటీవలే ముంబైకి వెళ్లివచ్చారు. మహారాష్ట్రలో పంట రుణాలు ఎలా మాఫీ చేశారనేదానిపై అక్కడి ఉన్నతాధికారులతో రెండు రోజుల పాటు స్టడీ చేశారు. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లోనూ ఇదే తరహాలో పంట రుణాల మాఫీ అమలు చేశారని అధికారులు చెబుతున్నారు.  

మహారాష్ట్రలో ఏకకాలంలో రుణమాఫీ 

మహారాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే షేట్కారీ ఖర్జ్ ముక్తి యోజన పేరుతో రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేసింది. 2015 ఏప్రిల్1 నుంచి 2019 మార్చి 31వరకు ఉన్న పంట రుణాలను ఏకకాలంలో మాఫీ అమలుచేసింది. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్​లోనూ కోఆపరేటివ్​ డిపార్ట్​మెంట్​ను నోడల్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీగా ఏర్పాటు చేసి రైతులకు రుణవిముక్తి కల్పించారు. ఈ నోడల్ ఏజెన్సీకి సర్కారు ష్యూరిటీ ఇచ్చి అసలు, వడ్డీతో కలిపి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తోంది. అయితే, తెలంగాణలో కోఆపరేటివ్ డిపార్ట్​మెంట్ కాకుండా వ్యవసాయ, ఆర్థిక శాఖల సమన్వయంతోనే రుణమాఫీ చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారులు సర్కారుకు నివేదిక అందించనున్నారు. నివేదిక అందిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.  

సమగ్ర అధ్యయనం తర్వాత గైడ్ లైన్స్  

రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే  రూ.2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్​అధికారంలోకి రావడంతో ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల టైంలోనూ ఇదే విషయాన్ని సీఎం రేవంత్​రెడ్డి ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. ఆగస్టు 15లోగా ఏకకాలంలో క్రాప్​లోన్లు మాఫీ చేస్తామని పలుమార్లు ప్రకటించారు. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు సవాల్ విసిరారు. 

రాజీనామాతో రెడీగా ఉండాలని సీఎం ప్రతిసవాల్ విసరడంతో ఈ అంశం రాజకీయాలను హీటెక్కించింది. ఇటు రైతుల్లోనూ రుణమాఫీపై ఉత్కంఠ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి క్రాప్​లోన్లను మాఫీ చేసి తీరాలని సీఎం రేవంత్​పట్టుదలతో ఉన్నారు. ఆయన ఆదేశాలతో ఇప్పటికే  బ్యాంకర్లు క్రాప్​లోన్ల లెక్కలు తీసి సర్కారుకు అందించారు. గైడ్ లైన్స్ పై అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. వడ్డీ మాఫీ విషయంలో, స్వల్పకాలిక పంట రుణాలతో పాటు బంగారం కుదువబెట్టి తీసుకున్న పంట రుణాలపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

అలాగే కుటుంబం యూనిట్​గా తీసుకోవాల్నా? అలా తీసుకుంటే గుర్తింపు కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాల్నా? ప్రభుత్వ ఉద్యోగులను, ట్యాక్స్ పేయర్లను అర్హులుగా గుర్తించాల్నా? వద్దా? ఇలాంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. పలు పథకాల్లో గత బీఆర్ఎస్ సర్కారు అనుసరించిన విధానాల వల్ల పెద్దమొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందనే విమర్శల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే గైడ్ లైన్స్​  రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. 

డిసెంబర్ 9 కటాఫ్ తేదీ! 

డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన రావడంతోపాటు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అగ్ర నేత సోనియాగాంధీ బర్త్​డే సైతం అదేరోజు కావడంతో ఈ తేదీకి పార్టీ పరంగా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే దీనిని సెంటిమెంట్​గా భావించి ఇదే రోజును పంట రుణాలకు కటాఫ్ తేదీగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 9 నాటికి రైతులకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేయాలని సర్కారు భావిస్తోంది. 

ముందుగా కటాఫ్‌‌‌‌‌‌‌‌ తేదీతో పాటు పంట రుణాల మాఫీకి విధివిధానాలను సర్కారు ప్రకటించనుంది. ఆ తర్వాతే బ్యాంకులు రైతుల పంట రుణాల లెక్కలు తేల్చనున్నారు. రుణమాఫీ వల్ల సర్కారుపై సుమారు రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు భారం పడవచ్చని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది.