కేసీఆర్ ఫ్యామిలీ.. రూ.50 వేల కోట్ల భూములు కాజేసేందుకు స్కెచ్: సీఎం రేవంత్

కేసీఆర్ ఫ్యామిలీ.. రూ.50 వేల కోట్ల భూములు కాజేసేందుకు స్కెచ్: సీఎం రేవంత్

హైదరాబాద్: మియాపూర్ భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తమ ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందని వెల్లడించారు. మియాపూర్‌లోని 550 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కలిసి సుమారు రూ.50 వేల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి తమ అనుయాయులకు భూములను కట్టబెట్టాలని చూశారని విమర్శించారు. మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న 550 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ భూముల వ్యవహారంపై పోరాటం చేశామని సీఎం గుర్తుచేశారు. అయితే గతంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం కోర్టుల్లో సమర్థవంతమైన వాదనలు జరగలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకుందన్నారు.

మియాపూర్ భూములను స్వాధీనం చేసుకున్న అనంతరం వాటిని ఏ విధంగా వినియోగించాలనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. అవసరమైతే ఈ భూములను విక్రయించి, తద్వారా వచ్చే నిధులను పేదల ప్రయోజనాల కోసం, విద్యావ్యవస్థ బలోపేతం కోసం ఖర్చు చేస్తామని వెల్లడించారు.

ఐఎంజీ భూముల వ్యవహారంలోనూ తమ ప్రభుత్వం కోర్టుల్లో బలంగా వాదనలు వినిపించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. సుమారు రూ.40 వేల కోట్ల విలువైన భూములను ఐఎంజీకి కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. హయత్‌నగర్‌లో 201 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు చెప్పారు.మంచిరేవులలోని 163 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేటీఆర్ ప్రయత్నించారని సీఎం ఆరోపించారు. అందులో 50 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.

కొండాపూర్‌లో రూ.3,600 కోట్ల విలువైన భూమిని కాపాడామని, భూపాలపల్లిలో రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకే ఆ భూమిని బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. కోర్టులో న్యాయపోరాటం చేసి ఆ ప్రభుత్వ భూమిని తిరిగి కాపాడామని వెల్లడించారు.

మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల భూములు కాపాడాం

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు మూడేళ్లలో సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు చెప్పారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూ ఆక్రమణల వెనుక ఎవరున్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.