కాబోయే ప్రధాని వయనాడ్​ నుంచే : సీఎం రేవంత్ రెడ్డి

కాబోయే ప్రధాని వయనాడ్​ నుంచే : సీఎం రేవంత్ రెడ్డి
  • వచ్చే 20 ఏండ్లు రాహుల్​ గాంధే ప్రధాని: సీఎం రేవంత్​రెడ్డి
  • పదేండ్ల కాలంలో మోదీ ప్రజలను వంచించారు
  • అన్నింట్లో దక్షిణాదిపై వివక్ష చూపిన బీజేపీకి ఓట్లడిగే హక్కు లేదు
  • కేరళలోని వయనాడ్​లో రాహుల్​గాంధీ తరఫున ఎన్నికల ప్రచారం
  • నేడు అలప్పుజలో కేసీ వేణుగోపాల్ ​తరఫున క్యాంపెయిన్

హైదరాబాద్, వెలుగు: వయనాడ్​కు కాబోయే ఎంపీయే దేశ ప్రధాని కానున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే 20 ఏండ్లు రాహుల్​గాంధీనే భారత ప్రధానిగా ఉంటారని చెప్పారు. ‘అబ్ కీ బార్ 400 పార్’ అని బీజేపీ నినదిస్తున్నా.. ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చే అవకాశమే లేదన్నారు. రెండు సార్లు ప్రధానిగా పని చేసిన మోదీ దేశ ప్రజలను వంచించడం తప్ప మరేమీ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్​గాంధీ ఎంపీగా పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్​రెడ్డి పాల్గొని ప్రసంగించారు.  

గత పదేండ్లుగా వారణాసి ఎంపీ దేశానికి ప్రధానిగా ఉన్నారని,  రాబోయే 20 ఏండ్లు వయనాడ్ ఎంపీయే ప్రధానిగా ఉంటారని ఇక్కడి​ ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని చెప్పారు. అవినీతికి ప్రధాని నరేంద్ర మోదీ చాంపియన్ అని ఆరోపించారు. పారదర్శకత కోసమే ఎలక్టోరల్ బాండ్లు తెచ్చామని మోదీ చెబుతున్నారని, అదే నిజమైతే సుప్రీంకోర్టు ఈ వ్యవస్థను ఎందుకు రద్దు చేసిందని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. పారదర్శకత ఉంటే ఎలక్టోరల్ బాండ్స్ కొన్న వారు, ముఖ్యంగా బీజేపీకి డబ్బులు ఇచ్చిన వారి పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. ఎలక్టోరల్ బాండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీ పథకమని ధ్వజమెత్తారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలంటే ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని, ఈవీఎంలపై ప్రతిక్షాలతోపాటు ప్రజలకు నమ్మకం పోయిందని రేవంత్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోలింగ్​కు బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తుంటే, మనదేశంలో మాత్రం ఈవీఎంలను ఉపయోగిస్తున్నారని చెప్పారు.

దక్షిణాదిపై మోదీ వివక్ష

దక్షిణాదిపై ప్రధాని మోదీ అడుగడుగునా వివక్ష చూపారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. దక్షిణ భారత దేశం కూడా ఇండియాలో భాగమేనని, ఈ ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ వద్దా? ఈ ప్రాంతానికి సబర్మతి వంటి రివర్ ఫ్రంట్ ఇవ్వరా? అని ప్రశ్నించారు. గుజరాత్‌‌‌‌కు కేటాయించిన బుల్లెట్ రైలును దక్షిణాదికి కూడా ఇస్తామని ఇప్పుడే ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారని నిల దీశారు. ఈ మధ్యకాలంలోనే మోదీ ఎందుకు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని రేవంత్​ అడిగారు. మోదీకి ఇక్కడి ప్రజల ఓట్లు మాత్రం కావాలి కానీ.. ఈ ప్రాంత నాయకులకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించరా? అని నిలదీశారు.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర రక్షణ మంత్రి వంటి కీలక పదవులు దక్షిణాది వారికి ఎందుకు ఇవ్వరని నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఎప్పుడో నిషే ధించాయని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లడిగే హక్కు బీజేపీకి లేదని అన్నారు. వయనాడ్​లో కేరళ సీఎం పినరయి విజయన్  ఎల్​డీఎఫ్​ అభ్యర్థికి సపోర్ట్​ చేయకుండా.. బీజేపీ అభ్యర్థి సురేంద్రన్​కు ఎలా మద్దతిస్తారని రేవంత్ ప్రశ్నించారు. అవినీతిని మోదీ చట్టబద్ధత చేస్తున్నారని, దీనికి ఇక్కడి సీఎం విజయన్ సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. 

నేడు అలప్పుజలో ప్రచారం

సీఎం రేవంత్​రెడ్డి గురువారం అలప్పుజలో నిర్వహించే కాంగ్రెస్​ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఆ నియోజకవర్గ కాంగ్రెస్​ అభ్యర్థి, ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ తరఫున రేవంత్​రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. ఇక్కడ ప్రచారం ముగించుకొని,  అక్కడి నుంచి బయలుదేరి గురువారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు.