లైఫ్ సైన్సెస్ లో తెలంగాణ టాప్...ఇన్నాళ్లూ మన మేధస్సు విదేశాలకు వాడాం.. ఇకపై మన ప్రజల కోసం వాడుదాం : సీఎం రేవంత్ రెడ్డి

లైఫ్ సైన్సెస్ లో తెలంగాణ టాప్...ఇన్నాళ్లూ మన మేధస్సు విదేశాలకు వాడాం.. ఇకపై మన ప్రజల కోసం వాడుదాం : సీఎం రేవంత్ రెడ్డి
  • బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీకి పూర్తి మద్దతు
  • ‘ఆసియా పసిఫిక్ బయోడిజైన్ ఇన్నోవేషన్ సమిట్’లో సీఎం రేవంత్
  • హెల్త్​ సవాళ్లను ఎదుర్కొనేలా ఆవిష్కరణలు రావాలి
  • సుల్తాన్‌‌‌‌పూర్‌‌‌‌ మెడికల్ డివైజెస్ పార్క్​​లో 
  • 60కి పైగా కంపెనీలు పనిచేస్తున్నాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: లైఫ్​ సైన్సెస్ రంగంలో జాతీయ స్థాయిలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ముఖ్యంగా డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నాలజీ, సర్జికల్ పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ వంటి రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు. బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. భారతదేశ ఆరోగ్య సంరక్షణ సవాళ్లను ఎదుర్కోవడానికి స్వదేశీ ఆవిష్కరణలు చాలా అవసరమని పేర్కొన్నారు. 

ఈ పరిశోధనలకు మద్దతు ఇవ్వడంతోపాటు, డేటా గోప్యతా ప్రమాణాలకు తగ్గట్టు వైద్య డేటాను అందించడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.  ఆదివారం  హైదరాబాద్‌‌లో ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఆసియా పసిఫిక్ బయోడిజైన్ ఇన్నొవేషన్ సమిట్ –2025’లో సీఎం మాట్లాడారు. ‘ఇన్నొవేషన్ ఆఫ్ భారత్ - ది బయోడిజైన్ బ్లూప్రింట్‌‌’ను ఆవిష్కరించారు. నూతన ఆవిష్కరణల కోసం విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, కార్పొరేట్ భాగస్వాములను అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు. 

మన దేశ ప్రజల కోసం ప్రతిభను వాడండి

ఇప్పటివరకు మన మేధస్సు ఇతర దేశాల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగపడిందని, కానీ ఇప్పుడు మన ప్రతిభ దేశ ప్రజల కోసం ఉపయోగించాల్సిన సమయం వచ్చిందని సీఎం రేవంత్​రెడ్డి  అన్నారు. రాష్ట్రం 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యంతో పనిచేస్తున్నదని పేర్కొన్నారు.  ప్రస్తుతం ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయని.. ప‌‌న్నులు, యుద్ధాలు, వాణిజ్యప‌‌ర‌‌మైన అడ్డంకులు వంటివి ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. 

ఇలాంటి స‌‌మ‌‌యంలో కొత్త ఆవిష్కరణలకు స‌‌రైన వేదిక తెలంగాణ‌‌ అని చెప్పారు. మాన‌‌వాళిని మ‌‌రింత ఆరోగ్యంగా మార్చడానికి మ‌‌నంద‌‌రం ప్రయత్నిద్దామన్నారు. తయారీ రంగం నుంచి ఆవిష్కరణల‌‌కు కేంద్రంగా తెలంగాణ‌‌ను మారుస్తున్నామని చెప్పారు.  

దేవుడు గొప్ప డిజైనర్.. ప్రకృతి ఉత్తమ గురువు​

దేవుడు గొప్ప డిజైనర్​ అని, ప్రకృతి ఉత్తమ గురువు అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మనం మంచి విద్యార్థుల‌‌మా.. లేదా.. అన్నదే ఇక్కడ ప్రశ్న అని పేర్కొన్నారు. ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకోవాలని, తప్పులు చేయకుండా ఉండటానికి అది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కృత్రిమ మేధస్సు అనేది బయోడిజైన్‌‌కు మంచి ఉదాహరణ అన్నారు. మానవులు కృత్రిమ మెదడును సృష్టించడానికి సహజ మెదడును ఉపయోగించారని చెప్పారు. 

మెడికల్​ డివైజ్​ పార్క్​లో 60కిపైగా కంపెనీలు

వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సుల్తాన్‌‌పూర్‌‌లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్‌‌ను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేశామని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఈ పార్క్‌‌లో 60కి పైగా ప్రపంచ, దేశీయ కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు. స్థానిక స్టార్టప్ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమల సహకారం వల్ల హైదరాబాద్ అనేక రంగాల్లో ప్రత్యేక కేంద్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు. 

బయోడిజైన్ విధానం క్లినికల్ అవసరాలకు ఆరోగ్య సంరక్షణకు ఆచరణాత్మక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఈ రంగంలో ఏఐజీ హాస్పిటల్స్​ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న పరిశోధనా కార్యక్రమాలను సీఎం రేవంత్​రెడ్డి అభినందించారు. సమిట్‌‌లో డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి, బయోడిజైన్ ఇన్నొవేషన్ సమిట్ చైర్మన్ డాక్టర్ రాజేశ్ కలపల, హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు, సెంటర్ ఫర్ బయోడిజైన్ (స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ) డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ మైరల్​ తదితరులు పాల్గొన్నారు.