
సోమవారం ( ఆగస్టు 25 ) ఓయూలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. పీవీ నరసింహారావు ఓయూ గడ్డ నుంచి ధిక్కార స్వరం వినిపించారని అన్నారు. ఓయూ అడ్డాగా కమ్యూనిస్టులు పోరాటం చేసారని.. తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన మర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, గద్దర్ లను అందించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు సీఎం రేవంత్.
తెలంగాణకు ఏ సమస్య వచ్చినా ఓయూ నుంచే చర్చ మొదలవుతుందని.. చదువుతో పాటు పోరాటాలు నేర్పిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. ఆనాడు రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేశారని.. శ్రీకాంత చారి అమరుడైనా.. వారి కుటుంబానికి ఏమి చేయలేకపోయారని అన్నారు. దేశానికి లాయర్, డాక్టర్ కాకుండా IAS,IPS లను అందించిన గడ్డ ఉస్మానియా అని అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ కళా విహీనంగా మారిందని.. తెలంగాణ సమాజానికి మెల్కోలిపే ఓయూను కాలగర్భంలో కలపాలని చూశారని మండిపడ్డారు సీఎం రేవంత్. దళిత బిడ్డను ఓయూ వీసీ గా నియమించామని.. తెలంగాణ సమాజానికి అందించే మేధా సంపత్తి ఓయూ నుంచే రావాలని అన్నారు సీఎం రేవంత్. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరమని.. చైతన్యం ఉన్న యువకులను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నామని అన్నారు.జూనియర్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీ విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారని.. డ్రగ్స్ మహమ్మారి తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్.