ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన : ఎంపీ వంశీకృష్ణ

ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన : ఎంపీ వంశీకృష్ణ
  • సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయాలు విప్లవాత్మకం: ఎంపీ వంశీకృష్ణ
  • గ్లోబల్ సమిట్ లో  తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ సీఎం రిలీజ్ చేస్తరు
  • రాష్ట్రాన్ని కొత్త ప్రగతికి తీసుకెళ్లే దిశగా గ్లోబల్​సమిట్: కడియం కావ్య
  • ఢిల్లీలో తెలంగాణ ఎంపీల మీడియా సమావేశం

న్యూఢిల్లీ, వెలుగు: రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మకమైన సంక్షేమ, అభివృద్ధి నిర్ణయాలను తీసుకొని అమలు చేశారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రజా పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల పాలన పూర్తి చేసుకోవడం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047 నిర్వహణ నేపథ్యంలో ఢిల్లీలో తెలంగాణ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంపీలు మల్లు రవి, సురేశ్​షెట్కార్, డాక్టర్ కడియం కావ్య, కాంగ్రెస్​ సీనియర్​నేత మధు యాష్కీ గౌడ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తూచా తప్పకుండ రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. గత పదేండ్లలో ‘కేసీఆర్ మోడల్’ పేరుతో బీఆర్ఎస్ సర్కార్ ఖజానా ఖాళీ చేసిందని విమర్శించారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు, ప్రజల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు దాదాపు రూ.60 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ. 8 వేల కోట్లు,  రైతు భరోసా కు రూ.21 వేల కోట్లు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం రూ.15 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు.

మంచి ఆలోచనతో రైజింగ్​సమిట్

మంచి ఆలోచనతో సీఎం రేవంత్​రెడ్డి ఈ నెల 8, 9న ఫ్యూచర్ సిటీలో రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ ను నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం రిలీజ్ చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ లో ఏవిధంగా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమి సృష్టించనున్నారో అందులో వివరిస్తారన్నారు. ఈ సమ్మిట్ కు రావాలని సీఎం, డిప్యూటీ సీఎంలతో కలిసి ప్రధాని మోదీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్​అగ్రనేత సోనియా గాంధీ, ఇతర ముఖ్య నేతలను పార్లమెంట్ లో కలిసి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఎంక్వైరీకి ఆదేశించండి

మూడు రోజులుగా మిస్ మేనేజ్మెంట్ తో సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఎంక్వైరీకి ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ వంశీకృష్ణ కోరారు. ఈ అంశంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి ఎంక్వైరీ చేయాలని కోరినట్లు చెప్పారు. ఇండిగో సంస్థ చేసిన తప్పిదాల వల్ల రూ.5 నుంచి 10 వేల ధర ఉండే ఎకనామి క్లాస్ టికెట్ ను 40 వేలకు అమ్ముతున్నారని తెలిపారు.

మహిళా సాధికరతకు ప్రభుత్వం ప్రాధాన్యం: కావ్య

ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రాష్ట్రాన్ని కొత్త ప్రగతి దిశలోకి తీసుకెళ్లేందుకు వేదికగా నిలవనుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్దే లక్ష్యంగా ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మహిళా సాధికారత, సహజ వనరుల ఆధారంగా ప్రాజెక్టుల రూపకల్పన, వినూత్న సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని స్పష్టం చేశారు.