- యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన
- కాట్రేపల్లి వద్ద కొడంగల్ లిఫ్ట్‌కు భూమిపూజ
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి డిసెంబరు ఒకటిన మక్తల్‌లో పర్యటించనున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి శనివారం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మక్తల్ మండలం గొల్లపల్లి శివారులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన, కాట్రేపల్లి వద్ద -కొడంగల్ లిఫ్ట్ స్కీమ్‌కు, మక్తల్ నుంచి -నారాయణపేట వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేయనున్నారు.
సీఎం పర్యటన సందర్భంగా మక్తల్ తహసీల్దార్ ఆఫీస్‌లో అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. గొల్లపల్లి వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లను చూసుకోవాలని ఆర్అండ్బీ ఆఫీసర్లకు సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమిపూజ తర్వాత సీఎం రోడ్డు మార్గంలో వస్తారని, రోడ్డు పొడవునా భద్రత, రహదారుల వెంబడి చెట్ల పొదలు తొలగించాలన్నారు.
కాట్రేపల్లి వద్ద కొడంగల్ లిఫ్ట్‌కు భూమిపూజ, పైలాన్ ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఆ తర్వాత బీటీ రోడ్డు పనులకు భూమిపూజ ఉంటుందని చెప్పారు. భూమిపూజ అనంతరం సీఎం పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారని, ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. గొల్లపల్లి వద్ద ఏర్పాటు చేసే బహిరంగ సభకు వివిధ జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు వస్తారన్నారు.
వాహనాల పార్కింగ్‌కు అవసరమైన స్థలాన్ని, వీఐపీల వాహనాల పార్కింగ్, మైక్ సెట్, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు తదితర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో చర్చించి సీఎం పర్యటన షెడ్యూల్ ను రూపొందించాలని కలెక్టర్‌కు సూచించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీను, ఆర్డీవో రాంచందర్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీధర్, ఆర్అండ్బీ ఈఈ వెంకట రమణయ్య, పంచాయతీరాజ్ ఈఈ హీర్యా నాయక్, విద్యుత్ శాఖ ఎస్ఈ వెంకటరమణ పాల్గొన్నారు.
