
- అవసరమైతే అర్ధరాత్రి కూడా కేబినెట్ భేటీ ఏర్పాటు చేస్త
- నా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు
- బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకే లోకల్‌బాడీ ఎలక్షన్స్ వాయిదా వేసినం
- బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. బీసీ బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి
- మోదీ స్థానంలో రాహుల్ ఉంటే 48 గంటల్లో రిజర్వేషన్లు
- రిజర్వేషన్లు 50 శాతం మించకుండా గత సర్కారు చట్టం
- కుల గణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని వెల్లడి
- సీఎం రేవంత్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన బీసీ నేతలు
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయడానికైనా తాను సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైతే అర్ధరాత్రి కూడా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తన నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని అన్నారు. నెలరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్ విధించిందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే ఇంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశా మని అన్నారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ బీసీ నేతలు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు కలిశారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేబి నేట్ ఆమోదం తెలపడం, పంచాయతీరాజ్ చట్టం సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరైనా కోర్టుకు వెళ్తే.. వాదించడానికి ఢిల్లీ నుంచి ఉద్ధండులైన న్యాయవాదులను నియమిస్తామని ప్రకటించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాగితం పెట్టిన వాళ్లని, పెట్టించిన వాళ్లని సామా జిక బహిష్కరణ చేస్తామని ప్రకటించాలని బీసీ నేతలకు పిలుపునిచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపైన కాంగ్రెస్ ఎంపీలతోపాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని, అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలైతేనే నిజమైన విజయమని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన ఎజెండా కావాలని ఆకాంక్షించారు.
బీజేపీ నిబద్ధతను నిరూపించుకోవాలి
బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీసీ బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఆర్. కృష్ణయ్య ఈ రిజర్వేషన్లను సాధించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ స్థానంలో రాహుల్ గాంధీ ఉండి ఉంటే.. 48 గంటల్లో తాను రిజర్వేషన్లను సాధించుకువచ్చేవాడినని అన్నారు. రిజర్వేషన్ల అంశంపై మోదీని తెలంగాణకు చెందిన బీజేపీ కేంద్ర మంత్రులు ప్రశ్నించాలని, బీజేపీ నాయకులు తమ నిబద్ధతను చాటుకోవాలని సూచించారు.
కులగణనకు తాము వ్యతిరేకమని బీజేపీ గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని జంతర్ మంతర్‌లో నిర్వహించిన ధర్నాకు 16 పార్టీలు మద్దతు ఇచ్చాయని చెప్పారు. తాము ఒత్తిడి తేవడం వల్లే కేంద్రం 2026లో జరిగే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించిందని, తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దని పంచాయతీరాజ్ చట్టం చేసిందని, ఆ చట్టం చేసినప్పుడు మంత్రులుగా గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ వాళ్లను తమపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఆ చట్టంలో పేర్కొన్న 50 శాతం నిబంధనను సవరిస్తూ తాము ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువస్తున్నామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది తామేనని అన్నారు.
రాహుల్ మాటే మాకు శిలాశాసనం
100 ఏండ్ల బీసీల ఆకాంక్షను రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని, బీసీ రిజర్వేషన్లు గొప్ప కార్యక్రమమని సీఎం రేవంత్ అభివర్ణించారు. ఆనాడు దళితులు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని గుర్తు చేశారు. కులగణన చేస్తామని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో స్పష్టం చేశారని, రాహుల్ గాంధీ మాట తమకు శిలాశాసనమని అన్నారు. నాయకుడు మాట ఇస్తే దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత తనది, పీసీసీ అధ్యక్షుడిదని తెలిపారు. కులగణన పైన ఎన్నో అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమించామని, ఏడాదిలో పూర్తి పారదర్శకంగా, పక్కాగా కులగణన పూర్తి చేశామని ప్రకటించారు. ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించుకున్నామని, అసెంబ్లీతోపాటు అన్ని వర్గాలతో కుల గణన పైన చర్చించి, అందరి అభిప్రాయాలను తీసుకున్నామని వివరించారు. రాహుల్ గాంధీ, ఖర్గే.. తెలంగాణ మోడల్‌లో కులగణన చేయాలని దేశమంతా చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
కులగణన దేశానికే ఆదర్శం
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ బీసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. కులగణన దేశానికే ఆదర్శమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో కులగణనను చాలా పకడ్బందీగా నిర్వహించామని తెలిపారు. వ్యక్తులు స్వయంగా తమ వివరాలను డిక్లేర్ చేశారని, కులగణన డేటాను 100 శాతం డిజిటలైజేషన్ చేశామని వెల్లడించారు. భవిష్యత్తులో ఎవరూ చాలెంజ్ చేయడానికి వీలు లేకుండా డేటాను భద్రపరిచామని వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ కులగణన ఒక బెస్ట్ మోడల్ అని పేర్కొన్నారు. రిజర్వేషన్ల ఫలాలను ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం అని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని చెప్పారు.