గ్రామాల్లోకి పాలనాధికారులు..నేడు (సెప్టెంబర్ 5న) 5 వేల మంది జీపీవోలకు నియామక పత్రాలు

గ్రామాల్లోకి పాలనాధికారులు..నేడు (సెప్టెంబర్ 5న) 5 వేల మంది జీపీవోలకు నియామక పత్రాలు
  • ఐదేండ్ల తర్వాత గ్రామాల్లోకి అధికారులు
  • 2020లో వీఆర్వో, వీఆర్‌‌‌‌‌‌‌‌ఏ వ్యవస్థను రద్దు చేసిన గత ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఐదేండ్ల తర్వాత గ్రామాల్లో పాలనాధికారులు అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు 5,000 మంది గ్రామ పాలన అధికారులకు (జీపీఓలకు) సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం హైటెక్స్‌‌‌‌లో నియామక పత్రాలు అందజేయనున్నారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ హయాంలో 2020లో రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థల తర్వాత గ్రామాల్లో అధికార వ్యవస్థ లేకుండా పోయింది. రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామాలు ఉన్నాయి. 

ఇందులో ఇటీవల జీపీవో నియామకం కోసం గతంలో వీఆర్‌‌‌‌‌‌‌‌వో, వీఆర్‌‌‌‌‌‌‌‌ఏలుగా పనిచేసిన వారికి రెండుసార్లు పరీక్ష పెట్టగా.. అందులో దాదాపు 5 వేల మంది అర్హత సాధించారు. ఇక, మిగిలిన సగం మంది డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌మెట్ ప్రాతిపదికన నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు రెవెన్యూలోనే పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, ఇతర అర్హత ఉన్న సిబ్బందిని ఇన్‌‌‌‌చార్జి జీపీవోలుగా ఆయా గ్రామాలకు పంపాలని చూస్తున్నది. 

గత ప్రభుత్వం 2020 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో దాదాపు 22 వేల మందికి పైగా వీఆర్‌‌‌‌‌‌‌‌వో, వీఆర్‌‌‌‌‌‌‌‌ఏలను 37 శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలకు అవసరమైన ఎంక్వైరీని ఈ అధికారులతోనే చేయించేలా జాబ్ చార్ట్‌‌‌‌ను ప్రభుత్వం రెడీ చేసింది. దీంతో పాటు గ్రామానికొక అధికారి ఉంటే క్యాస్ట్, ఇన్ కం వంటి సర్టిఫికెట్లతో పాటు పంచనామా, భూముల రికార్డులు (మ్యానువల్ పహాణీలు), ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరులు, చెట్ల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో విచారణ కొత్తగా నియమించనున్న అధికారులకు అప్పగించనుంది. 

ల్యాండ్ సర్వే సంబంధిత పనుల్లో సహాయం చేయడం, ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, భూ సర్వేకు హెల్పర్‌‌‌‌‌‌‌‌గా ఉండడం, విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు వంటి బాధ్యతలతో పాటు సాధారణ పరిపాలన శాఖకూ సహాయం చేసేలా డ్యూటీ చార్ట్ రూపొందిస్తున్నారు. 

61 ఏండ్లు దాటిన వీఆర్‌‌‌‌‌‌‌‌ఏల వారసుల ఎదురుచూపులు..

రాష్ట్రంలో వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశాక 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. అయితే, ఈ హామీ ఇంకా నెరవేరలేదు. రాష్ట్రంలో సుమారు 3,797 మంది వీఆర్ఏలు 61 ఏండ్లకు పైబడిన వారు ఉన్నారు. ఈ వీఆర్ఏలు ఉద్యోగం నుంచి విరమణ పొందిన తర్వాత, వారి వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 కానీ, ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. వీఆర్ఏలు ఉద్యోగం నుంచి తప్పుకోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వారసులకు ఉద్యోగ నియామక ప్రక్రియలో జాప్యం కారణంగా చాలా మంది ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.