బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ పూంజా అరెస్టుపై స్పందించిన కర్నాటక సీఎం సిద్ధ రామయ్య

బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ పూంజా అరెస్టుపై స్పందించిన కర్నాటక సీఎం సిద్ధ రామయ్య

 మంగళూరు: చట్టం ముందు అందరూ సమానమేనని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. పోలీసులను బెదిరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ పూంజాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆయనపై వచ్చిన ఆరోపణలను కొట్టేస్తారా అని ప్రశ్నించారు. శనివారం సిద్ధ రామయ్య మంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘‘ పోలీసులను బెదిరించినందుకు ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 353 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఇది నాన్ బెయిలబుల్ నేరం. 

చట్ట ప్రకారం ఆయనకు ఏడేండ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. హరీశ్ పూంజా ఎమ్మెల్యే అయినంత మాత్రాన పోలీసులను బెదిరిస్తారా..?  ఆయనపై వచ్చిన ఆరోపణలను కొట్టేయాలా..?”అని ప్రశ్నించారు. కాగా, అక్రమ క్వారీయింగ్ కేసులో బీజేపీ కార్యకర్త శశిరాజ్ శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విడుదల చేయాలంటూ మే 18న బెల్తంగడి పోలీస్ స్టేషన్‌‌‌‌లోకి ఎమ్మెల్యే హరీశ్ పూంజా దూసుకెళ్లారు. దీంతో ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు మొదట కేసును నమోదు చేశారు. ఈ ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌కు వ్యతిరేకంగా తాలూకా కార్యాలయం ఎదుట ఆయన నిరసన ప్రదర్శన చేపట్టారు.