
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో బొద్దింకలు కనిపించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకు బయల్దేరిన ఎయిరిండియా 180 విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం మార్గం మధ్యలో ఉండగా ఇద్దరు ప్రయాణికులు తమ క్యాబిన్లో బొద్దింకలను కనుగొన్నారు. దీంతో వెంటనే సిబ్బందికి విషయం చెప్పారు. ఫ్లైట్ కోల్ కతాలో ల్యాండైన తర్వాత బొద్దింకలను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం ఆ ప్రయాణికులకు అదే క్యాబిన్ లో వేరే సీట్లు ఏర్పాటు చేశారు. బొద్దింకలతో ఇబ్బందిపడ్డ ప్యాసింజర్లకు సంస్థ క్షమాపణ చెప్పింది.
మరో విమానంలో టెక్నికల్ సమస్య..
బెంగళూరు నుంచి కోల్ కతా వెళుతున్న ఎయిరిండియా విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో విమానాన్ని తిరిగి బెంగళూరుకు తీసుకెళ్లారు. దీంతో పైలట్లు సమస్యను గుర్తించి విమానాన్ని రెండు గంటల పాటు గాల్లో నడిపారు. ముందుజాగ్రత్త చర్యగా సేఫ్ ల్యాండ్ చేసేందుకు విమానంలో నుంచి ఇంధనం అంతా ఖాళీ చేశారు. ఫ్లైట్లో కాస్త బరువు తగ్గాక బెంగళూరులోని ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.