కాపాడాలంటూ ‘కరోనా దేవి’ టెంపుల్

కాపాడాలంటూ ‘కరోనా దేవి’ టెంపుల్

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా కరోనా మరణాలే. కరోనాను ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ.. కరోనాను అరికట్టేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా తమిళనాడులోని ఒక ఆలయ ట్రస్ట్ సభ్యులు తమ ప్రజలను కరోనా నుంచి కాపాడాలంటూ కరోనా దేవి ఆలయాన్ని నిర్మించారు. 

కోయంబత్తూరులోని కమాట్చిపురి టెంపుల్ ట్రస్టు నిర్మించిన ఈ ఆలయంలో 1.5 అడుగుల పొడవుతో నల్లరాతితో చేసిన కరోనా దేవి అమ్మవారిని ప్రతిష్టించారు. ప్రజలను కరోనా నుంచి బయటపడేయాలని కోరుతూ అమ్మవారికి బుధవారం నుంచి 48 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ట్రస్టు సభ్యులు చెప్పారు. గతంలో కలరా, ప్లేగు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అలాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తారనే నమ్మకంతోనే మరియమ్మన్, మకాలి అమ్మన్, కరుమరియమ్మన్ దేవతలను ప్రతిష్టించి పూజించారని చెప్పారు. ఇదే తరహాలో ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించాలంటూ కరోనా దేవిని పూజిస్తున్నట్లు ట్రస్ట్ మేనేజర్ ఆనంద్ భారతి చెప్పారు.