గోవుల కోసం కోటి సంతకాల సేకరణ 

గోవుల కోసం కోటి సంతకాల సేకరణ 
  • తిరుమల శ్రీవారి సన్నిధి నుండి ప్రారంభించిన యుగ తులసి ఫౌండేషన్
  • తొలి రోజే సంతకాలు చేసిన శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామీజీ,  మై హోం గ్రూప్ అధినేత డా.జూపల్లి 

తిరుపతి: గోవుల సంరక్షణ కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమించాలని నిర్ణయించిన యుగతులసి ఫౌండేషన్ కార్యక్రమాన్ని తిరుమలలో శ్రీవారి సన్నిధి నుండి శ్రీకారం చుట్టింది. గో హింస ఆపాలని...  గో హత్యలు ఆగాలని..  కబేళాలు మూసి వేయాలని.. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని..  డిమాండ్ చేస్తూ యుగ తులసి చేపట్టిన గోవిందుని సాక్షిగా గోవు కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గురువారం తిరుమల శ్రీవారి సన్నిధి నుండి ప్రారంభమైంది. ఇవాళ్టి నుండి సెప్టెంబర్ 1 వ తేదీ వరకూ నిర్వహించనున్న ఈ సంతకాల సేకరణలో దేశవ్యాప్తంగా అతిరధ మహారధులు పాల్గొంటున్నారు. 
గోవిందుని సాక్షిగా చేపట్టిన ఈ కార్యక్రమం తొలిరోజే శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీ, మై హోం గ్రూప్ అధినేత డా. జూపల్లి రామేశ్వర రావు తమ సంతకాలు చేసి...  సంతకాల సేకరణ ఉద్యమానికి తమ సంఘీభావం తెలియజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు, సంతులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. రెండు నెలల పాటు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించబోతున్నామని, కోటి సంతకాలు పూర్తి చేసి గౌరవ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీడీ రూపంలో అందజేస్తామని యుగ తులసి చైర్మన్ కొలిశెట్టి శివ కుమార్ తెలియజేసారు. ఈ సంవత్సరమే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఒక సాధనంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.