‘ఇందిర సౌర గిరి జల వికాసం’ అమలుకు చర్యలు : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

‘ఇందిర సౌర గిరి జల వికాసం’ అమలుకు చర్యలు : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలుకు జిల్లాలో పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు మహబూబాబాద్​ కలెక్టర్అద్వైత్ కుమార్ సింగ్  తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ చిత్రమిశ్రా, డీఎఫ్ వో విశాల్ తో కలసి సమీక్ష నిర్వహించారు. అర్హత కలిగిన ఆర్వో ఎఫ్ఆర్ పట్టేదారులను మండల స్థాయి కమిటీ ద్వారా గుర్తించి భూగర్భ జల సర్వేలను నిర్వహించి, బోరు బావులు నిర్మించి, సోలార్ సిస్టం ద్వారా మోటర్స్ యూజ్​ చేస్తూ, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా హార్టికల్చర్, వ్యవసాయం, సాగులోకి తీసుకువచ్చి రైతు ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా చేయనున్నట్లు తెలిపారు.

క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పథకానికి అర్హులైన వారికి అందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేసి ఆసక్తి కలిగిన ట్రైబల్ రైతులకు ఈ పథకం ఆవశ్యకతల గురించి వివరించాలన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా పరిధిలోని బయ్యారం, గంగారం, గార్ల, గూడూరు, కేసముద్రం, కొత్తగూడ, కురవి, మహబూబాబాద్, నెల్లికుదురు మండలాల్లో ప్రత్యేక సభల ద్వారా ఆసక్తి కలిగిన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో  ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ దేసిరామ్, డీడీ గ్రౌండ్ వాటర్ వేముల సురేష్, ఏఎన్డీసీఎల్ ఎస్ఈ నరేశ్, హార్టికల్చర్  ఆఫీసర్​మరియన్న, ఐటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.