నాగర్ కర్నూల్ జిల్లాలో పత్తి కొనుగోళ్లలో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

నాగర్ కర్నూల్ జిల్లాలో పత్తి కొనుగోళ్లలో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో పత్తి కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని కలెక్టర్  బదావత్  సంతోష్  ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలకపల్లి మండలం చిన్న ముద్దునూరు గ్రామంలోని వినాయక కాటన్  మిల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ట్యాబ్ ఎంట్రీ, గేట్ ఎంట్రీ పాస్, పంట నమోదు ప్రక్రియ, స్లాట్  బుకింగ్  తదితర అంశాలను పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

 తేమశాతంలో వెసులుబాటు ఇవ్వాలని, ఆకాల వర్షాలతో దెబ్బతిన్న పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరారు. స్లాట్  బుకింగ్  చేసుకున్న రోజే పత్తి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీసీఐ అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. స్లాట్  బుకింగ్  విధానంతో రైతులు జిన్నింగ్  మిల్లుల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సిన ఇబ్బంది తప్పిందని చెప్పారు.

గడువులోగా పనులు పూర్తి చేయాలి

వంగూర్  మండలం కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్  బదావత్  సంతోష్  ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్  దేవసహాయంతో అభివృద్ధి పనులపై రివ్యూ చేశారు. టెండర్  ప్రక్రియను స్పీడప్​ చేసి, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు.