ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • తెలంగాణ వైద్య విధాన పరిషత్ వైద్యులతో సమీక్ష 

ఖమ్మం టౌన్, వెలుగు :  మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ వైద్యులతో ఆస్పత్రుల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. జిల్లాలో 4 ఏరియా ఆస్పత్రులు, 3 సీహెచ్​సీలు వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయని తెలిపారు.

 సత్తుపల్లి, మధిర, కల్లూరు ఏరియా ఆస్పత్రుల కొత్త భవనాల నిర్మాణం పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. రెండు రోజుల్లో వైద్యులందరూ ఆధార్ ఆధారిత హాజరు యాప్ లో నమోదు అవ్వాలని ఆదేశించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఏవైనా మందులు కొరత ఉంటే వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ యూనిట్, మార్చురీ ల ఏర్పాటుకు అవసరమైన చోట ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ రాజశేఖర్, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్య శాఖ ఈఈ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. 

భూ సేకరణ స్పీడ్ అప్ చేయాలి 

జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ స్పీడ్ అప్ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో  మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, జాతీయ రహదారులు, ఖమ్మం ఖిల్లా రోప్ వే, ఇతర అభివృద్ధి పనుల భూ సేకరణ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.  మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఖమ్మం రూరల్, అర్బన్ మండలాల్లో రైతులు అంగీకరించిన స్థలంలో,  ప్రభుత్వ పట్టా భూముల్లో పనులు స్పీడప్​ చేయాలని సూచించారు. 

ప్రత్యామ్నాయంగా రైతులకు అందించే లేఔట్ ప్లాట్లలో అంతర్గత రోడ్లు, స్ట్రీట్ లైట్, విద్యుత్ సరఫరా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.  ఖమ్మం రోప్ వే నిర్మాణానికి అవసరమైన స్థలం సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితులకు ప్రత్యామ్నా యంగా వైద్య కళాశాల సమీపంలో ప్లాట్ లను ఇస్తున్నామని, మంత్రి చేతుల మీదుగా పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణ కూడా త్వరగా చేపట్టాలని ఆదేశించారు. కాగా, 2024 ఐఏఎస్ బ్యాచ్ లో 11వ ర్యాంక్ సాధించిన వరంగల్‌కు చెందిన ఇ. రాజు, రజిత దంపతుల కుమార్తె ఇ. సాయి శివాని తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఖమ్మం కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సాయి శివాని, ఆమె తల్లిదండ్రులకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.