ఎన్నికల నిర్వహణ బాధ్యత పీవోలదే : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఎన్నికల నిర్వహణ బాధ్యత పీవోలదే : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల నిర్వహణ బాధ్యత పీవో(ప్రిసైడింగ్ ఆఫీసర్)లదేనని హైదరాబాద్ జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం మలక్ పేట, యాకత్ పురా సెగ్మెంట్లకు చెందిన పీవోలకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్​లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ.. ఎన్నికల రూల్స్​ను పాటిస్తూ బాధ్యతతో పనిచేయాలన్నారు.  పీవోలు, ఏపీవోలకు ఈవీఎంలపై పూర్తి అవగాహన  ఉండాలన్నారు.  ట్రైనింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మోడల్ ఈవీఎంలపై మంచి శిక్షణ పొంది, వాటి పనితీరుపై ఎలాంటి అనుమానాలు ఉన్నా ఇక్కడే నివృత్తి చేసుకోవాలని సూచించారు.

పోలింగ్ కేంద్రంలో రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లతో మంచి అవగాహనతో  పని చేయాలని, ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల రోజు పీవోలకు బీఎల్వోలు, సెక్టార్ అధికారులు సాయం చేస్తారని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులకు హ్యాండ్ బుక్, చెక్ లిస్ట్, చేయదగినవి, చేయకూడనివి తెలిపే మెటీరియల్​ను అందజేస్తామన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు దీపాంకర్ సిన్హా మాట్లాడుతూ..  పీవోలు, రిటర్నింగ్ అధికారులతో కలిసి ఒక టీమ్​గా ఏర్పడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మలక్​పేట రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి, యాకత్ పురా రిటర్నింగ్ అధికారి వెంకటా
చారి, ఏఆర్వోలు, అధికారులు పాల్గొన్నారు.

ప్రలోభాలకు గురిచేస్తే సీ విజిల్ యాప్​లో ఫిర్యాదు చేయాలి 

ఎన్నికల రూల్స్ బ్రేక్ చేసిన వారిపై సీ విజిల్ యాప్​లో ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.  వీడియో, ఫోటో రూపంలో ఫిర్యాదు చేయొచ్చన్నారు. సీ విజిల్ యాప్​ను ఫోన్​లో ప్లే స్టోర్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవాలన్నారు.  అభ్యర్థులు లేదా వారి అనుచరులు ఓటర్లను భయాందోళనకు గురిచేయడం, బహిరంగ ప్రదేశాల్లో విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టడం, ప్రలోభాలకు గురి చేస్తే యాప్​లో ఫిర్యాదు చేయాలన్నారు. ఇప్పటి వరకు 571 ఫిర్యాదులు రాగా.. వాటన్నింటినీ 100 నిమిషాల్లో పరిష్కరించామని తెలిపారు.