- అందుబాటులో 13,180 మెట్రిక్ టన్నుల యూరియా
- కొణిజర్ల పీఏసీఎస్‌ను పరిశీలించిన ఖమ్మం కలెక్టర్, సీపీ
కొణిజర్ల, వెలుగు : పంట సాగు చేసే ప్రతి రైతుకూయూరియా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం కొణిజర్లలోని గోపవరం పీఏసీఎస్ సెంటర్‌ను సీపీ సునిల్దత్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో మొత్తం 13,180 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మార్క్‌ఫెడ్ వద్ద 8,822 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్‌ల వద్ద 917 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు దుకాణలోల 944 మెట్రిక్ టన్నులు, పాతనిల్వలు 2495 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.
మొక్కజొన్న సాగయ్యే మండలాల్లో యూరియా వాడకం అధికంగా ఉందని, ఆ మండలాలను గుర్తించి కొణిజర్ల, చింతకాని, బోనకల్లు, ముదిగొండ మండలాల్లో ప్రతీ 2 వేల ఎకరాల సాగు విస్తీర్ణానికి ఒక యూరియా సేల్‌పాయింట్ ఏర్పాటు చేశామని, కొణిజర్ల మండలంలో ఏడింటికి అదనంగా మరో 9 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఏ కేంద్రంలో యూరియా నిల్వలు ఉన్నాయో ముందస్తుగా సమాచారం ఇస్తూ ముందస్తుగా కూపన్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. రైతాంగం సమన్వయంతో అధికారులకు సహకరిస్తూ వారికి సూచిచిన సమయంలో వచ్చిన యూరియా తీసుకెళ్లాలన్నారు. సాగు విస్తీర్ణానికి మించి యూరియా తీసుకెళ్లకుండా అధికారుల సమీక్షించాలన్నారు.
యూరియా దొరకదనే అపోహలు విడనాడాలని ఇండ్లలో యూరియా నిల్వ చేసుకుంటు దాని నాణ్యత దెబ్బతింటుందని, రైతులెవరూ అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సీపీ సునిల్దత్తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ ఎం.అపూర్వ, వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ, కొణిజర్ల ఏవో దొడ్డిగర్ల బాలాజీ, తహసీల్దార్ అరుణ, తదితరులు పాల్గొన్నారు.
