
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తాలు పేరుతో ధాన్యంలో కోతలు పెడితే చర్యలు తప్పవని కలెక్టర్ బాదావత్ సంతోష్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లపై రైతులు, మిల్లర్లు, రైతు సంఘాల నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల కష్టం వృథా కాకూడదని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అమ్మిన ధాన్యానికి మద్దతు ధర 48 నుంచి 72 గంటల్లోపు వారి ఖాతాల్లో జమ కావాలని స్పష్టం చేశారు. మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, తేమ కొలిచే పరికరాలు, గడ్డి తొలగించే యంత్రాలు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం సరిగ్గా కొలవడం, ధాన్యం నాణ్యత పర్యవేక్షణ, మిల్లులకు తరలింపుపై డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించాలని తెలిపారు.
వరి కోతలు ప్రారంభమైన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు రైతుల అవసరాలకు అనుగుణంగా హార్వెస్టర్లను సమీకరించి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ పి.అమరేందర్, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో చిన్న ఓబులేశ్, జిల్లా సహకార అధికారి రఘు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంతరావు, పౌర సరఫరాల అధికారి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.