నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, భీమ్లా నాయక్‌తో కలిసి ప్రిసైడింగ్, అసిస్టెంట్ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికలో అధికారులు, ఎంపీడీవోల బాధ్యత అత్యంత కీలకమన్నారు.
జిల్లాలో 5 వేల మించి జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.లక్ష 50 వేలు 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న సర్పంచ్ అభ్యర్థులు రూ.లక్ష 50 వేలు, వార్డు సభ్యులు రూ.30 వేల వరకే ఖర్చు చేయాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ నాగర్ కర్నూల్ మండల పరిధిలోని గగ్గలపల్లి గ్రామంలో జిల్లా రవాణా అధికారి ఆఫీస్‌ను సందర్శించారు. అధికారులు, ఉద్యోగుల హాజరు, పనితీరు, నిర్వహణ విధానాలను పరిశీలించారు. అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి చిన్న బాలు నాయక్, ఆర్టీవో ఇన్స్పెక్టర్లు మహేశ్, అనూప్ రెడ్డి, రాజశేఖర్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు.
