రైతులు విభిన్న పంటలు వేయాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

రైతులు విభిన్న పంటలు వేయాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : రైతులు విభిన్న పంటలు వేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ దేవ సహాయంతో కలిసి పీఎం కృషి యోజన కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటల మార్పిడి చేయాలని, ఇందుకు సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించే విధంగా ఉండాలన్నారు.

 వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచాలని చెప్పారు. పీఎండీడీకేయూ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, గోదాముల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకులు ముందు ఉండాలన్నారు. రైతులు సాయిల్ హెల్త్ కార్డును తీసుకొని వాటికి అనుగుణంగా ఎలాంటి పంటలు వేయాలో వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని చెప్పారు. 

ఓకే పంటపై రైతులు దృష్టి సారించకుండా విభిన్న పంటలు సాగు చేస్తున్నప్పుడే ఉత్పాదకత పెరిగి ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి రజిని, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి జ్ఞాన శేఖర్, జిల్లా డైయిరీ డీడీ సత్యనారాయణరెడ్డి, జిల్లా నీటిపారుదలశాఖ అధికారి మురళి, అధికారులు పాల్గొన్నారు. 

పత్తి కొనుగోలు సజావుగా సాగాలి

కల్వకుర్తి, వెలుగు : జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్ గ్రామ శివారులో ఉన్న బాలాజీ జిన్నింగ్ మిల్లును ఆయన సందర్శించి పత్తి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సరైన మద్దతు ధర, చెల్లింపులో పారదర్శకత ఉండాలన్నారు. అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాల తెలంగాణ గిరిజన ఆశ్రమ, గిరిజన సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ కల్వకుర్తి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 6వ గిరిజన జోనల్ స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి ఫిరంగి, తహసీల్దార్‌‌‌‌ ఇబ్రహీం తదితరుల పాల్గొన్నారు.