
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో వడ్ల కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. బుధవారం అడిషనల్ కలెక్టర్ చాంబర్ లో అడిషనల్ కలెక్టర్ పి అమరేందర్, రెవెన్యూ, పౌరసరఫరాలు, రవాణా శాఖల అధికారులు, మిల్లర్లు, లారీ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, ఎక్కడా వడ్లు తడవకుండా చూడాలని సూచించారు. సెంటర్ల నుంచి మిల్లులకు, గోదాములకు వడ్లు తరలించేందుకు అవసరమైన లారీలు, హమాలీలను సమకూర్చుకోవాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వర్షాలతో కారణంగా వడ్లు తడిసిపోకుండా చూడడం ముఖ్యమని పేర్కొన్నారు.
2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు
రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో బీసీ, ఎస్సీ, మైనారిటీ, ట్రైబల్ కార్పొరేషన్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్వయం ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.