గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు : కలెక్టర్ నారాయణరెడ్డి 

గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు : కలెక్టర్ నారాయణరెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు :  ‘నేను గంజాయి వాడను’ అనే నినాదంతో ఈనెల 14 నుంచి వారం రోజులపాటు జిల్లాలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దడంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంపై సోమవారం కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన మీడియా అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణలో మీడియా పాత్ర చాలా ముఖ్యమన్నారు.

జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో గంజాయి వాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. గంజాయితోపాటు డాక్టర్ల ప్రిస్ర్కిప్షన్​ లేకుండానే మత్తు టాబ్లెట్లు వాడుతున్నారని చెప్పారు. గంజాయి అనేది ఒక సామాజిక రుగ్మత అని, దాన్ని పూర్తిగా రూపుమాపాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.  ఆగస్టు14 నుంచి యూట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో ‘నేను గంజాయి వాడను’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్,  అడిషనల్ ఎస్పీ రాములునాయక్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.  

ఉద్యోగులకు అటెండెన్స్ యాప్..

నల్గొండ​, వెలుగు : జిల్లాలో గాడి తప్పిన అధికార యంత్రాంగాన్ని దారిలో పెట్టేందుకు నల్గొండ కలెక్టర్​ సి.నారాయాణరెడ్డి మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. గ్రామ, మండల స్థాయిలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కొత్త అటెండెన్స్​యాప్​ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. స్థానికంగా ఉండాల్సిన ఉద్యోగులు హైదరాబాద్ సహా దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.  మండల, గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ప్రజావాణిలో ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి.

దీంతో సెప్టెంబర్ 1 నుంచి అటెండెన్స్​ యాప్​ను అందుబాటులోకి తేనున్నట్లు అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ప్రకటించారు. దీంతో ప్రతిఒక్కరూ ఉదయం 10 గంటల వరకు విధుల్లోకి రావాలని, అటెండన్స్​యాప్​లో హాజరు నమోదు చేయగానే ఆ వివరాలు డేటాబేస్​లో ఎంటర్ అవుతాయి. మరోవైపు జిల్లాలో జ్వర సర్వేలో సాధారణ ఫీవర్స్​కేసులే ఉన్నాయని చెప్తుంటే.. ఫీల్డ్​లో పరిస్థితి మరోలా ఉందని తెలిసింది. దీంతో అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఈనెల 16 నుంచి వారం రోజులపాటు మరోసారి ఫీవర్​సర్వే నిర్వహించాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు.