అప్లికేషన్లన్నీ ఆన్​లైన్​లో నమోదు చేస్తాం

అప్లికేషన్లన్నీ ఆన్​లైన్​లో నమోదు చేస్తాం

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆన్ లైన్ లో నమోదు చేస్తామని కలెక్టర్  జి.రవినాయక్  తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఎలాంటి తప్పులు లేకుండా డేటా నమోదు చేయాల్సిన బాధ్యత ఆపరేటర్లపై ఉందన్నారు. వారికి అవసరమైన కంప్యూటర్లు, ఇతర సౌలతులు కల్పిస్తామన్నారు. 

గ్రామపంచాయతీ కార్యదర్శి, కౌంటర్ల ఇన్​చార్జీలు డేటా నమోదు చేసేందుకు సహకరిస్తారని తెలిపారు. జిల్లాలో స్వీకరించిన  దరఖాస్తులన్నీ ఎంటర్  చేసేందుకు 46 టీమ్స్​ ఏర్పాటు చేశామని, ఒక్కో టీమ్​కు ఒక్కో లాగిన్  ఇచ్చినట్లు చెప్పారు. దరఖాస్తు ఫారాలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకెళ్లవద్దని,  సంబంధిత ఆఫీసుల్లోనే డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. అడిషనల్  కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఎస్. మోహన్ రావు, ఆర్డీవో అనిల్ కుమార్, ఈ- జిల్లా మేనేజర్ చంద్రశేఖర్  పాల్గొన్నారు.
 

డేటా ఎంట్రీని పక్కగా చేయాలి
 

గద్వాల: ప్రజాపాలన అప్లికేషన్ల డిజిటలైజేషన్  పక్కాగా చేయాలని గద్వాల కలెక్టర్  సంతోష్  కోరారు. కలెక్టరేట్  మీటింగ్ హాల్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్  ట్రైనర్  శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 1.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఎలాంటి తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలన్నారు. జిల్లాలో 350 మంది ఆపరేటర్లు ఉన్నారని, అందరూ కలిసి గడువులోగా డిజిటలైజేషన్  కంప్లీట్ చేయాలన్నారు. అప్లికేషన్లలో సమాచారాన్ని యథావిధిగా ఎంటర్  చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, శ్రీనివాసులు ఉన్నారు.