ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ హనుమంతరావు

ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ హనుమంతరావు

యాదగిరిగుట్ట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్పీడప్ చేసి గృహప్రవేశాలు జరుపుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు గుంటిపల్లి రేణుకకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని స్వయంగా పర్యవేక్షించి ఎన్ని గజాల్లో నిర్మాణాన్ని చేపట్టారని అడిగి తెలుసుకున్నారు. 

మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి.? ఎన్ని నిర్మాణంలో ఉన్నాయని అధికారులను అడిగారు. ఇంకా మొదలవ్వని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభమయ్యేలా ఆఫీసర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లను నిర్మిస్తున్న మేస్త్రీలకు స్క్వేర్ ఫీట్ కు రూ.300 కంటే ఎక్కువ ఇవ్వొద్దని లబ్ధిదారులకు సూచించారు.

 ఇండ్ల నిర్మాణాలకు అవసరమయ్యే ఇటుక, సిమెంట్, స్టీల్ తదితర మెటీరియల్ తక్కువ ధరకు వచ్చేలా లబ్ధిదారులకు అధికారులు సహాయం చేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, మున్సిపల్ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.