
యాదగిరిగుట్ట, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా రైతుల నుంచి వచ్చిన భూసమస్యల దరఖాస్తులను రెవెన్యూ పరంగా తప్పులు లేకుండా పరిష్కరించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం మోటకొండూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లను పరిశీలించారు. సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలన్నారు. మాన్యువల్ గా వచ్చిన దరఖాస్తులు, తహసీల్దార్ లాగిన్ లో ఉన్న అప్లికేషన్లను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
మహబూబ్ పేటలో ప్రైమరీ స్కూల్ కు సందర్శించిన కలెక్టర్
యాదగిరిగుట్ట మండలం మహబూబ్ పేటలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌ను కలెక్టర్ హనుమంతరావు బుధవారం సందర్శించారు. విద్యాబోధన ఎలా ఉందని విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నలకు సరైన అన్సర్స్ చెప్పిన విద్యార్థులకు స్వీట్స్ ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల కంటే ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్సే ఇంగ్లిష్ లో చక్కగా రైమ్స్ చెప్పారని అభినందించారు. మోటకొండూర్ తహసీల్దార్ నాగదివ్య, మహబూబ్ పేట్ ప్రైమరీ స్కూల్ టీచర్ సుమిత్ర, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.