
యాదాద్రి, వెలుగు : వైద్యాధికారులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఎంతమంది సిబ్బంది హాజరయ్యారని సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు సమయపాలన పాటించాలని చెప్పారు.
ఆస్పత్రిని శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లను వైద్య పరీక్షల నిమిత్తం ప్రైవేట్ ల్యాబ్ కి పంపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.