వారబందీ పద్ధతిలో సాగునీటిని విడుదల చేస్తాం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

వారబందీ పద్ధతిలో సాగునీటిని విడుదల చేస్తాం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు :  ఏఎంఆర్పీ కాల్వల ద్వారా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వారబందీ పద్ధతిలో సాగునీటిని విడుదల చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండలోని తన క్యాంప్ కార్యాలయంలో సాగునీరు విడుదలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏఎంఆర్పీ కాల్వలకు సాగు నీరందించే నాలుగు మోటర్లకు ఒక మోటారు రిపేర్​లో ఉండడం, మూడు మోటార్లు ట్రిప్ కావడం వల్ల పూర్తి స్థాయిలో నీరు రావడం లేదన్నారు.

 ఉదయసముద్రం నుంచి 100  క్యూసెక్కుల నీరు తక్కువగా వస్తున్నదని తెలిపారు. మోటారు మరమ్మతులకు ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉన్నందున సాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉదయసముద్రం నుంచి 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు వివరించారు. 

ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందిస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చెరువులకు నీరు ఇవ్వలేమన్నారు. నాలుగు నెలల వరకు చెరువులను నింపేదిలేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నెహ్రూనాయక్, ప్రభు కల్యాణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆంజనేయస్వామి పాల్గొన్నారు. 

మెరుగైన వైద్యం అందించాలి..

చండూరు (మరిగూడ), వెలుగు : కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యులకు సూచించారు. మర్రిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాలసిస్ యూనిట్ ను ఇతర విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సందర్శించి విద్య, భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు.