
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
హాలియా, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ సరిగా లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం పెద్దవూర మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో రికార్డులు సరిగా నిర్వహించకపోవడం, ధాన్యం కొనుగోళ్లపై అవగాహన లేకపోవడం, విధుల పట్ల సిబ్బంది అలసత్వం వహించడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రం నిర్వాహకులు, సంబంధిత అధికారులపై ఉందన్నారు. అనంతరం మండలంలో లింగంపల్లి గ్రామంలో రైతు ఉత్పత్తుల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇక్కడ కూడా రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంపై నిర్వాహకులపై మండిపడ్డారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీశ్, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.