- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం నల్గొండ కలెక్టరేట్లో స్వాతంత్ర్య దినోత్సవా నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా శాఖలు వారీగా ప్రగతికి సంబంధించిన నివేదికలను తక్షణమే అందజేయాలన్నారు. ఆగస్టు 15న ఉదయం 9 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య వేడుకలు మొదలవుతాయని తెలిపారు.
జాతీయ పతాకావిష్కరణ, వందన స్వీకరణ, సందేశం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, స్టాల్స్ తదితర అంశాలు ఉంటాయని వివరించారు. సమావేశంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అడిషల్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఇన్చార్జి డీఆర్వో అశోక్ రెడ్డి, డీఆర్డీవో శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి
దేవరకొండ, వెలుగు : వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి డాక్టర్లకు సూచించారు. గురువారం పీఏపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్, గుడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటగది, ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది హాజరు పట్టిక, ఓపీ రిజిస్టర్, మందుల స్టాక్ ను
పరిశీలించారు.
