మక్తల్ లో కృష్ణానది.. ఉగ్రరూపం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరికలు జారీ

మక్తల్ లో కృష్ణానది.. ఉగ్రరూపం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరికలు జారీ
  • వాసునగర్ ప్రజలను 
  • సురక్షిత ప్రాంతానికి తరలింపు

మక్తల్, వెలుగు :  కృష్ణానదికి ఉధృతి పెరుగుతుండడంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. నదీపరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మక్తల్, మాగనూర్, కృష్ణా మండలాల్లోని నదిపరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. కృష్ణామండలంలోని వాసునగర్​లోని ప్రజలను ఇండ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. 

ప్రస్తుతం కృష్ణా, భీమా నదులకు ఆరు లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్​ డ్యాం నుంచి 2 లక్షల క్యూసెక్కులు, భీమా నది నుంచి 3.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో నారాయణపేట జిల్లాలోని కృష్ణానదికి వరద ఉధృతి గంట గంటకు పేరుగుతోంది. ప్రస్తుతం కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తహసీల్దార్​శ్రీనివాసులు, ఎస్ఐ నవీద్, ఆర్ఐ శ్రీనివాస్​గౌడ్, అధికారులు మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నాటక, మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంలు నిండి దిగువన ఉన్న కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగిందన్నారు. 5.20 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశామన్నారు. ఇంకా ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మక్తల్​ నియోజకవర్గంలోని మక్తల్, మాగనూర్, కృష్ణా మండలంలోని కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.  

వాసునగర్​ను ఖాళీ చేయించిన అధికారులు..

కృష్ణా మండలం బార్డర్ చెక్​పోస్టు సమీపంలో ఉన్న వాసునగర్​కు కృష్ణానది వరద నీరు గ్రామంలోకి వచ్చి చేరుతుండడంతో అధికారులు ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి తరలించారు. ఇప్పటికే గ్రామ సమీపంలోని పంట పోలాల్లోకి వరద వచ్చి చేరింది. వరద నీరు గ్రామంలోకి చేరడంతో వారిని ముందస్తుగా అధికారులు అక్కడి నుంచి తరలించారు.