నస్పూర్, వెలుగు: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం నస్పూర్ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంట గది, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
పాఠశాలలో సౌకర్యాలు, విద్యాబోధన తీరుపై విద్యార్థులను ఆరా తీశారు. అనంతరం మంచిర్యాల ఆర్డీవో ఆఫీస్‌ను తనిఖీ చేశారు. ఆర్డీవో శ్రీనివాసరావుతో కలిసి జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి ఆర్బిట్రేషన్ రికార్డులను పరిశీలించారు. ప్రభావిత గ్రామాల్లో అవార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.
వైద్య కళాశాల పనులు త్వరగా పూర్తవ్వాలి
హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం సంబంధిత పనులను రోడ్లు, భవనాల శాఖ డీఈ సజ్జత్ బాషాతో కలిసి పరిశీలించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రూ.216 కోట్లతో ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి అడిషనల్కలెక్టర్ మనోజ్ తో కలిసి పోలీస్, రెవెన్యూ, రవాణా, జాతీయ రహదారులు, రోడ్లు, భవనాలు, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై అనధికార వాహనాల నిలుపుదల, నిబంధనల ఉల్లంఘన పట్ల ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. జాతీయ రహదారి 363 పక్కన అక్రమ హోటళ్లు, వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా ఉండాలి
ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా ఉండాలని, అవినీతి, అక్రమాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ లో సంబంధిత వాల్ పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. వారోత్సవాలను నవంబర్ 2 వరకు ఘనంగా నిర్వహించాలని సూచించారు.
